దీదీకి షాక్: శారదా స్కాం కేసు పర్యవేక్షణకు సుప్రీం నిరాకరణ

                                     

Last Updated : Feb 11, 2019, 02:36 PM IST
దీదీకి షాక్: శారదా స్కాం కేసు పర్యవేక్షణకు సుప్రీం నిరాకరణ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శారద స్కాం కేసులో పశ్చిమ బెంగాల్ సీఎం మమతకు సుప్రీంకోర్టు చుక్కెదురైంది. ఈ కుంభకోణం కేసు పర్యవేక్షణకు అత్యున్నత ధర్మాసనం తిరస్కరించింది. ఈ కేసుకు సంబంధించి  పర్యవేక్షక కమిటీ ఏర్పాటు చేయాలన్న ఉద్దేశం తమకు లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

కేంద్రం తమ ప్రభుత్వం పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందని..అందుకు సీబీఐను పావుగా వాడుకుంటోందని మమత సర్కార్ గత కొన్ని రోజులుగా ఆరోపిస్తూ వస్తోంది. ఈ క్రమంలో సీబీఐ విచారిస్తున్న శారదా స్కాం కేసును న్యాయస్థానం పర్యవేక్షించాలని పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారణ జరిగిన సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది
 

వేల కొట్ల కుంభకోణం జరిగిందనే ఆరోపణలపై శారద చిట్స్ ఫండ్ కేసును సీబీఐ విచారిస్తోంది. ఈ కేసు విచారణను చేపట్టిన సీబీఐ ఇటీవల కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ను విచారించేందుకు ఆయన ఇంటికి వెళ్లగా వివాదం చెలరేగింది. స్థానిక పోలీసులు సీబీఐ అధికారులను అడ్డుకుని నిర్బంధించడం... కేంద్రం తీరును నిరసిస్తూ మమతా బెనర్జీ దీక్షకు దిగడం తెలిసిందే.

విచారణలో తమకు సహకరించడం లేదని దీనిపై సీబీఐ.. సుప్రీంకోర్టును ఆశ్రయించగా రాజీవ్‌కుమార్‌ విచారణకు హాజరు కావాల్సిందేనని...కానీ ఆయనను అరెస్టు చేయవద్దంటూ అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పడంతో తాత్కాలికంగా ఆ వివాదం కొలిక్కివచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్రం,సీబీఐ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ కేసుకు సంబంధించి పర్యవేక్షక కమిటీని నియమించాలని మమత సుప్రీం కోర్టును కోరగా ఇందుకు న్యాయమూర్తి నిరాకరించారు.

Trending News