ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. భారత్‌లో నేటి వరకు ఫిర్యాదుల విభాగాన్ని కానీ లేదా ఫిర్యాదులు స్వీకరించే అధికారిని కానీ ఎందుకు నియమించలేదని కోర్టు ఈ నోటీసుల ద్వారా సంస్థను ప్రశ్నించింది. వాట్సాప్‌తోపాటు కేంద్ర సమాచార, ఆర్థిక శాఖలకు కూడా సుప్రీం కోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులుపై 4 వారాల్లోగా వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఆదాయపన్ను విభాగం నిబంధనల ప్రకారం భారత్‌లో వాట్సాప్ గ్రీవెన్స్ అధికారిని నియమించలేదని పేర్కొంటూ ఓ పిటిషనర్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు ఈ నోటీసులు జారీచేసింది.
ఇదిలావుంటే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వివిధ నకిలీ వార్తల నియంత్రణ దశగా చర్యలు తీసుకునేందుకు నడుం బిగించిన కేంద్రం.. ఏదైనా ఒక నకిలీ వార్త మూలాలు ఎక్కడి నుంచి మొదలయ్యాయో తెలుసుకునేలా ఒక వ్యవస్థను రూపొందించాల్సిందిగా వాట్సాప్‌ను ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే, ఐటీ శాఖ ఇచ్చిన ఆదేశాలపై రెండు రోజుల తర్వాత నింపాదిగా స్పందించిన వాట్సాప్.. ఇది తమ యూజర్ల ప్రైవసీకి భంగం కలిగించినట్లు అవుతుందంటూ కేంద్రానికి జవాబు ఇచ్చింది. యూజర్ల వివరాలు ఇవ్వడం కుదరదు అంటూ వాట్సాప్ కేంద్రానికి ఇచ్చిన సమాధానంలో పేర్కొంది. అయితే, నకిలీ వార్తల జోలికి వెళ్లకుండా ఉండేందుకు తమ వంతు బాధ్యతగా యూజర్లకు అవగాహన కల్పించే ప్రయత్నం మాత్రం తప్పకుండా చేస్తామని కేంద్రానికి విన్నవించింది.