రూ.120 కోట్ల పన్ను ఎగవేత కేసులో.. మరో రాష్ట్రమంత్రి

ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాశ్‌ గెహ్లాట్ ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడి చేశారు.

Last Updated : Oct 13, 2018, 09:51 PM IST
రూ.120 కోట్ల పన్ను ఎగవేత కేసులో.. మరో రాష్ట్రమంత్రి

ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాశ్‌ గెహ్లాట్ ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడి చేశారు. ఆయన దాదాపు రూ.120 కోట్ల రూపాయల పన్ను ఎగవేతకు పాల్పడినట్లు తమ వద్ద ఆధారాలున్నాయని వారు తెలిపారు. ఈ క్రమంలోనే ఆయన కార్యాలయంపై దాడులు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. పలు నకిలీ కంపెనీలు ప్రారంభించి.. దాదాపు రూ.70 కోట్ల వరకు ఆయన రుణాలు తీసుకున్నారని ఆరోపణలు చేశారు. అలాగే బినామీ పేర్ల మీద ఆయన ఆస్తులు కొన్నారని.. మంత్రి వద్ద పనిచేసే డ్రైవర్‌తో పాటు పలువురు ఉద్యోగులు కూడా ఆయనకు బినామీలుగా వ్యవహరించారని తెలిపారు.

దుబాయ్ లాంటి ప్రాంతాల్లో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసిన అనుభవం ఉందని.. ఇక్కడ డబ్బును అక్కడికి తరలించినట్లుగా తమకు తోస్తుందని ఆదాయ శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఈ దాడులను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. ఈ దాడులు చేయించింది సాక్షాత్తు భారత ప్రధాని నరేంద్ర మోదీ అని.. ఆయన క్షమాపణ చెప్పాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. 

కైలాశ్‌ గెహ్లాట్ ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వంలో రవాణా శాఖతో పాటు రెవెన్యూ, సమాచార, ప్రసారాల శాఖ, న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాలు మొదలైన శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. నజఫ్ ఘర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన గెహ్లాట్.. న్యాయవాదిగా కూడా ఎంతో పేరు గాంచారు. 

Trending News