ఢిల్లీ శివార్లలోని నొయిడాలో తలదాచుకున్న ఇద్దరు ఉగ్రవాదులను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌కి చెందిన ఈ ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను ముషారఫ్ హుస్సేన్, రుబెల్ అహ్మాద్లుగా గుర్తించారు. ఉత్తర్ ప్రదేశ్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ పోలీసులు, పశ్చిమ బెంగాల్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ అనంతరం ఈ ఇద్దరు అరెస్ట్ అయినట్టు సమాచారం. ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్ అనంతరం ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న ఓ పోలీసు అధికారి మీడియాతో మాట్లాడుతూ.. దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్ర దాడులకు ఈ ఇద్దరు ఉగ్రవాదులు వ్యూహరచన చేసినట్టు తెలిపారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సమీపిస్తున్న తరుణంలో పాకిస్తాన్‌కి చెందిన జైషె మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఢిల్లీలో దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఇంటెలీజెన్స్ వర్గాలు చేసిన హెచ్చరికలతో అప్రమత్తమైన పోలీసులు ఢిల్లీతోపాటు పరిసర ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఇటీవల జాతీయ భద్రతా విభాగం చేతిలో అరెస్ట్ అయిన జైషే మహమ్మద్ ఉగ్రవాదులు సయ్యద్ మునీర్-ఉల్-హసన్ ఖాద్రి, ఆశిక్ బాబా, తారిఖ్ అహ్మద్ దర్ ఎన్ఐఏ విచారణలో స్వయంగా వెల్లడించిన వివరాల ప్రకారం నిఘావర్గాలు కేంద్ర హోంశాఖను అప్రమత్తం చేశాయి.