యస్ వై నాట్: 2019లో మెజారిటీ సాధిస్తే నేనే ప్రధానిని: రాహుల్ గాంధీ

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తొలిసారిగా ప్రధాని పదవిపై పెదవి విప్పారు.

Last Updated : May 8, 2018, 12:47 PM IST
యస్ వై నాట్: 2019లో మెజారిటీ సాధిస్తే నేనే ప్రధానిని: రాహుల్ గాంధీ

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తొలిసారిగా ప్రధాని పదవిపై పెదవివిప్పారు. మంగళవారం కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగళూరులో ఆయన మాట్లాడుతూ… 2019లో కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీగా అవతరిస్తే తానే ప్రధాని పదవి చేపడతానన్నారు.

బెంగళూరులో రాహుల్ మీడియాతో మాట్లాడుతూ, అవినీతి వ్యక్తిని కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థిగా మోదీ ఎందుకు ప్రకటించారో చెప్పాలని అన్నారు. 35 వేల కోట్లు దోచుకున్న రెడ్డి వర్గానికి ఎందుకు 8 సీట్లు ఇచ్చారు? అని రాహుల్‌ ప్రశ్నించారు. ఉద్యోగ కల్పన ఎందుకు జరగడం లేదో మోదీ యువతకు సమాధానం చెప్పాలన్నారు.

సోమవారం పెట్రోల్‌ ధరల పెరుగుదలను నిరసిస్తూ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా  కోలార్‌లో రాహుల్‌ గాంధీ సైకిల్ తొక్కారు. పెట్రోల్‌ ధరలు పెంచుతూ ప్రజల సొమ్మును కేంద్రం దోచుకుంటోందని ఆరోపించారు. మోదీ పనిచేసే మొబైల్‌ఫోన్‌ లాంటివారు కాదని, ఎప్పుడూ ఉపన్యాసాలు, విదేశీ యానాలతో స్పీకర్‌ మోడ్‌లోనో, ఏరోప్లేన్‌ మోడ్‌లోనో ఉంటారని ఎద్దేవాచేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఒక హత్య కేసులో నిందితుడుగా ఉన్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. నిజాయితీ, మర్యాద లాంటి వాటి గురించి మాట్లాడే ఆ పార్టీకి హత్య కేసులో నిందితుడు అధ్యక్షుడిగా ఉండటం శోచనీయమని రాహుల్‌ అన్నారు.

 

 

గత సంవత్సరం డిసెంబర్‌లో రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఎన్నికైన సంగతి తెలిసిందే..! గత సంవత్సరంలోనే సెప్టెంబర్‌లో పార్టీ వైస్‌ప్రెసిడెంట్‌గా ఉన్నపుడు రాహుల్ 2019 సాధారణ ఎన్నికలలో ప్రధాని అభ్యర్థిగా నిలబడటానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

Trending News