Heavy Rains Alert: కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది. బెంగళూరు మహా నగరంలో కురిసిన భారీ వర్షాలకు టెకీ ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆందోళన కల్గిస్తోంది. ఇంటి నుంచి బెంగుళూరుకు చేరుకునే క్రమంలో వరద నీటిలో చిక్కుకుపోయి ప్రాణాలు పోగొట్టుకుంది. అందరూ చూస్తుండగానే ప్రాణాలు పోయిన వైనం కలచివేస్తోంది.
కర్ణాటక రాజధాని బెంగళూరుని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఆకస్మిక వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు, రోడ్లపై ఒక్కసారిగా వరదనీరు దూసుకొచ్చింది. ఫలితంగా వరదల్లో కారు చిక్కుకుపోయిన ఏపీకు చెందిన టెకీ భానురేఖారెడ్డి ప్రాణాలు కోల్పోయింది. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా తేలప్రోలుకు చెందిన భానురేఖారెడ్డి బెంగళూరు ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో టెకీగా పనిచేస్తోంది. కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్ నుంచి నిన్న మద్యాహ్నం బెంగళూరుకు కారులో చేరుకున్నారు. నగరంలోని కేఆర్ కూడలికి కారు చేరుకునే సమయానికి వర్షం తీవ్రమైంది. ఇంకాస్త ముందుకెళ్లేసరికి అక్కడున్న అండర్ పాస్‌లోకి ఒక్కసారిగా వరద నీరు చొచ్చుకొచ్చింది. నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో కారు ఆ వరద నీటిలో చిక్కుకుపోయింది. కారులో ఉన్న ఆరుగురు వరదనీటిలో మునిగిపోసాగారు. ఈ పరిస్థితిని గమనించి స్థానిక సిబ్బంది రంగంలో దిగి అందర్నీ కారు నుంచి బయటకు లాగారు. ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంగా అందులో ఒకరైన భానురేఖారెడ్డి ప్రాణాలు వదిలేసింది.
ఈ ఘటన రాష్ట్రమంతా కలకలం రేపింది. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య ఆసుపత్రికి వెళ్లి బాధితురాలి కుటుంబసభ్యుల్ని పరామర్శించారు. కుటుంబసభ్యులకు 5 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. వర్షాల తీవ్రత దృష్టిలో ఉంచుకుని రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని బెంగళూరు నగర పాలికా కమీషనర్ తుషార్ గిరినాథ్, బెంగళురు పోలీస్ కమీషనర్ ప్రతాప్ రెడ్డిలను ఆదేశించారు.
భానురేఖారెడ్డి స్వస్థలం కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేని గూడెం. చిన్నప్పటి నుంచి అమ్మమ్మ ఇంట్లోనే అమ్మతో కలిసి పెరిగింది. వీరపనేని గూడెం తండ్రి ఊరు. ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో ఉండేవారు. కొద్దిరోజుల కోసం ఇంటికి హైదరాబాద్ వెళ్లిన భానురేఖారెడ్డి కుటుంబసభ్యుల్ని తీసుకుని బెంగళూరు చేరుకుంది.
బెంగళూరు ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే భానురేఖా రెడ్డి మృతికి కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవానికి ఆసుపత్రికి తీసుకొచ్చే సమయానికి భానురేఖారెడ్డి కొన ఊపిరితో ఉందని, తక్షణ వైద్యం చేసేందుకు ఆసుపత్రి వైద్యులు నిరాకరించడంతో ఆమె ప్రాణాలు పోయాయని అక్కడున్న విలేకర్లు ముఖ్యమంత్రికి విన్నవించారు. ఇందుకే తామే సాక్ష్యమన్నారు కూడా. ఈ ఘటనపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రంగా స్పందించారు. తక్షణం దర్యాప్తు జరిగి రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook