Bandi Sanjay Khammam Meeting: ప్రజలను అరిగోస పెడుతున్న కేసీఆర్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం వింతగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ఢిల్లీలో ప్రధాని అధ్యక్షతన జరిగిన నీతి అయోగ్ సమావేశానికి డుమ్మా కొట్టిన ఆప్ నేతలు హైదరాబాద్ కు రావడం సిగ్గు చేటన్నారు. లిక్కర్ దందాలో వాటాల లెక్కలు మాట్లాడుకునేందుకే వారంతా సీఎం కేసీఆర్ ను కలిశారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోందని, బీజేపీ ఇమేజ్ తగ్గిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని బండి సంజయ్ కొట్టిపారేశారు. ‘‘అటు ఇటు కాని కాంగ్రెస్ మాకు ప్రత్యామ్నాయమా? బీజేపీ గ్రాఫ్ ఎక్కడ తగ్గిందో చెప్పండి. 2018 ఎన్నికల తరువాత జరిగిన అన్ని ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో విశ్లేషించాలని సవాల్ విసిరారు. డిపాజిట్లు కూడా దక్కని కాంగ్రెస్ ను లేపేందుకు కొందరు వేస్తున్న ఎత్తుగడగా అభివర్ణించారు.
ప్రజా సమస్యలపై బీజేపీ పోరాడుతుంటే... ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామాలని మండిపడ్డారు. పొరపాటున కేసీఆర్ కు మళ్లీ అధికారమిస్తే యువత అంతా సూసైడ్ నోట్ రాసుకున్నట్లేనని హెచ్చరించారు. కొలువులు కావాలంటే కమలం రావాలంటూ నినదించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జంబో డీఎస్పీని ప్రకటించి 25 వేల టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడంతోపాటు పేదలందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తామన్నారు. నిలువ నీడలేని వాళ్లకు ఇండ్లు కట్టిస్తామని, రైతులకు ఫసల్ బీమా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్రంలోని యువత అంతా బీజేపీకి 5 నెలలు టైమ్ ఇవ్వాలని బండి సంజయ్ కోరారు.
శనివారం ఖమ్మం వచ్చిన బండి సంజయ్ కుమార్ జడ్పీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి ‘‘నిరుద్యోగ మార్చ్’’ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేలాదిగా తరలివచ్చిన నిరుద్యోగులు, బీజేపీ కార్యకర్తలతో జడ్పీ చౌరస్తా కిక్కిరిసిపోయింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు గరికపాటి మోహన్ రావు, పార్టీ తమిళనాడు సహ ఇంఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సంకినేని వెంకటేశ్వరరావు, డాక్టర్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, కోశాధికారి బండారి శాంతికుమార్, జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధులు రాకేశ్ రెడ్డి, జె.సంగప్ప, రాష్ట్ర నాయకులు దరువు ఎల్లన్న, డాక్టర్ పుల్లారావుతోపాటు వేలాది మందితో కలిసి పదం పదం పాడుతూ... కదం తొక్కుతూ జడ్పీ సెంటర్ నుండి మయూరి సెంటర్, పాతబస్టాండ్ దాకా నిరుద్యోగ మార్చ్ నిర్వహించారు. అనంతరం పాతబస్టాండ్ వద్ద బండి సంజయ్ మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
ఖమ్మంలో బీజేపీ ఎక్కడుందని వాగిన నేతలంతా ఇక్కడికొచ్చి చూడండి... గెలిచేది బీజేపీయే... రాబోయేది రామరాజ్యమే.
కమ్యూనిస్టు పార్టీలకు సిగ్గు లేదు. తోకపార్టీలు, సూది దబ్బడం పార్టీలన్న కేసీఆర్ మోచేతి నీళ్ళు తాగుతున్నారు.
ఒకాయనేమో హత్య కేసు నుండి తప్పించుకోవడానికి కేసీఆర్ దగ్గర పార్టీని తాకట్టు పెట్టిండు... ఇంకోకాయన సీట్ల కోసం పార్టీని తాకట్టు పెట్టిండు..
ఖమ్మం వస్తే సాయి గణేష్ గుర్తుకొస్తున్నడు.. కాషాయ కార్యకర్తలు చేస్తున్న ఫైట్ కు సెల్యూట్ చేస్తున్నా.
కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ ఒక్కటే... కాంగ్రెస్ పార్టీ అడ్రస్ ఎప్పుడో గల్లంతైంది.... 2018 నుండి ఇప్పటిదాకా జరిగిన అనేక ఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్లే రాలేదు. గతంలో 29 శాతం ఉన్న కాంగ్రెస్ ఓట్లు 19 శాతానికి దిగజారాయి. దుబ్బాకలో డిపాజిట్లు కూడా రాలే... వీళ్లా బీజేపీకి ప్రత్యామ్నాయం?
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ దమ్ము చూపింది. 4 సీట్లున్న బీజేపీ 48 గెలుచుకుంది. మరి కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది ఎన్ని? రెండంటే రెండే.... ఆ పార్టీ మాకు ప్రత్యామ్నాయమా ? అటు ఇటు కానోడిని తీసుకొచ్చి సంసారం చేయమంటే చేస్తాడా? మరి ఓట్లు, సీట్లు లేని డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్ ఏం చేస్తది.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీకి 6 వేల ఓట్లు మాత్రమే తేడా... హుజూరాబాద్, దుబ్బాకలో బీఆర్ఎస్ పార్టీని ఓడించాం. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు గల్లంతు చేశాం. మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. 2018లో 40 శాతం ఓట్లున్న బీఆర్ఎస్ ఇప్పుడు 30 శాతానికి పడిపోయింది.
ఇయాళ కేసీఆర్ దోస్త్ పంజాబ్ సీఎం వచ్చిండు. ఇద్దరు తాగుడు బ్యాచే. కొత్త స్కాచ్ బాటిల్ తీసుకొచ్చిండు. ఆప్ నేతలు ఇయాళ వచ్చింది ఎందుకో తెలుసా.... లిక్కర్ దందాలు పంచుకోవడానికే.
పోలీసులకు ప్రమోషన్లు లేవు... పోస్టులన్నీ ఖాళీ... ఆ పోలీసులతోనే పోరాడే కార్యకర్తలను కొట్టిస్తున్నరు. ఇయాళ కూడా బ్యారికేడ్లు పెట్టినా పోలీస్ వలయాన్ని చేధించుకుని వచ్చిన నిరుద్యోగులకు నా సెల్యూట్.
పేద ప్రజల కోసం నేను చావడానికైనా సిద్ధం... వాళ్ల కోసం గూండాయిజం చేయడానికైనా సిద్ధం...
బీఆర్ఎస్ నేతల్లారా... బీజేపీ కార్యకర్తల జోలికొస్తే ఖబడ్దార్... మీ దుకాణం 5 నెలలే. ఆ తరువాత ఖేల్ ఖతం దుకాణం బంద్.
ఖమ్మం జిల్లా ప్రజలు అల్లాడుతున్నారు. గోదావరి జలాలను తీసుకొచ్చారా? సీతారామ ప్రాజెక్టు పూర్తయ్యిందా?
అగ్గిపెట్టె మంత్రి... తెలంగాణ ఉద్యమంలో కిరోసిన్ పోసుకున్నా అగ్గిపెట్టె ఎందుకు దొరకలేదో ఇంతవరకు సమాధానం చెప్పలేదు. అంతర్జాతీయ సంస్థలతో దర్యాప్తు చేయిస్తే బయట పడుతుందేమో...
నేనే నిఖార్సైన హిందువునని చెప్పిన కేసీఆర్ బీజేపీ దెబ్బకు తాళలేక తన బూతు పత్రికలో నేనే హిందువునని ఫొటోలు వేయించుకున్నా జనం నమ్మడం లేదు.
కేసీఆర్ ను ఖమ్మం ప్రజలు ఎట్లా భరిస్తున్నరు? భద్రాచలంకు తలంబ్రాలు ఎందుకు తీసుకురావడం లేదు? ఏం పుట్టింది? భద్రాచలం అభివృద్ధి కోసం రూ.100 కోట్లు ఇస్తానన్నడు ఏమైంది? మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గ్రేట్. ప్రసాదం స్కీం కింద నిధులు తీసుకొచ్చిండు.
రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగుల కోసం ‘‘నిరుద్యోగ మార్చ్’’ చేస్తుంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటై ప్రజల దృష్టిని మళ్లించే కుట్ర చేస్తున్నయ్.
నిరుద్యోగుల కోసం పోరాడుతున్నం. లాఠీ దెబ్బలు తిన్నం. జైలుకు పోయినం. అయినా వెనుకాడకుండా ఉద్యమిస్తున్నాం. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాల్సిందే. కేసీఆర్ కొడుకును కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాల్సిందే. నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారం ఇవ్వాల్సిందే.
నిరుద్యోగులారా... మాకు 5 నెలలు టైమివ్వండి.. రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. పార్టీ అధికారంలోకి రాగానే ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. బిశ్వాల్ కమిటీ నివేదిక ప్రకారం 1.91 లక్షల పోస్టులను భర్తీ చేసే బాధ్యత మాది. ఒకేసారి జంబో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి 25 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తాం.
కేసీఆర్ కొడుకు రెండుసార్లు మంత్రి అయ్యిండు. అల్లుడు రెండుసార్లు మంత్రి అయ్యిండు. బిడ్డను ఎంపీ చేసిండు. ఓడిపోయినా ఎమ్మెల్సీ చేసిండు.. సడ్డకుడి కొడుకును ఎంపీ చేసిండు. మరి నిరుద్యోగులు ఏం పాపం చేశారు ? వాళ్లకు ఎందుకు ఉద్యోగాలెందుకు ఇవ్వడం లేదు? కనీసం నోటిఫికేషన్ వేయడం కూడా ఎందుకు చేతగావడం లేదు?
నీ కొడుకు, నీ ప్రభుత్వం తప్పు చేయకపోతే టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీపై విచారణ జరిపించడానికి అభ్యంతరాలేమిటి? మాతోపాటు 30 లక్షల మంది ఉద్యమిస్తున్నా, విచారణకు డిమాండ్ చేస్తున్నా ఎందుకు స్పందించడం లేదు?
నిరుద్యోగుల పక్షాన పోరాడుతుంటే... టెన్త్ హిందీ పేపర్ లీకేజీ పేరుతో నన్ను జైలుకు పంపారు. హిందీలో 21 మార్కులొస్తే పాస్ అవుతారు. అందులో 20 మార్కులు స్కూల్లోనే వేస్తారు. మరి లీకేజీ చేయాల్సిన అవసరం ఎందుకుంటుంది? అయినా భయపడను. మీకోసం చావడానికైనా సిద్ధమే. ఎందుకంటే బండి సంజయ్ మోదీ శిష్యుడు. అమిత్ షా, నడ్డా అభిమానిని... మీకోసం ఎంతదాకైనా పోరాడతా...
కేసీఆర్ పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేరు. కేసీఆర్ కుటుంబం మాత్రమే సంతోషంగా ఉన్నరు. రైతులు అల్లాడుతున్నరు. పంట నష్టపోయినా పైసా సాయం చేయకుండా మోసం చేయని మూర్ఖుడు కేసీఆర్. ఉద్యోగాల్లేక యువత అరిగోస పెడుతోంది. పరీక్షలు నిర్వహించడం చేతగాకపోవడంతో విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే దుస్ఠితి.. కేసీఆర్ చేతగానితనంవల్ల సిరిసిల్లలో చిన్న అమ్మాయి కొనఊపిరితో అల్లాడి చనిపోయింది.
ఆర్టీసీ కార్మికులు గుండె పగిలి చనిపోయారు. సింగరేణి కార్మికులు అల్లాడుతున్నరు. వీఏఓలు, స్టాఫ్ నర్సులు, వీఆర్ఓలు ఆందోళన చేస్తూనే ఉన్నారు.
అయినా సిగ్గు లేకుండా కేసీఆర్ మోదీని తిడుతున్నడు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడని చెబుతున్నరు. కేసీఆర్ ది నోరా... డ్రైనేజీయా? ఫినాయిల్ తో కడిగినా ఆ కంపు పోదు.
ప్రజాస్వామ్యం గురించి నువ్వు మాట్లాడటమా? అధికారాలివ్వకుండా కలెక్టర్లకు అధికారాలిచ్చి సర్పంచ్, ఎంపీటీసీలను ఉత్సవ విగ్రహాలుగా మార్చావు. వాళ్లకు నిధులివ్వకుండా ఆత్మహత్య చేసుకునే దుస్థితికి తీసుకొచ్చినవ్. సర్పంచులు పెట్రోలు బంకుల్లో పనిచేయాల్సిన దుస్థితి. ఆస్తిపాస్తులమ్మి అప్పులపాలైన దుస్థితి వాళ్లది.
సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులారా.... 5 నెలల్లో ఎన్నికలు రాబోతున్నయ్. కాళోజీ మాటలు స్మరించుకోండి. పరాయివాడు తప్పు చేస్తే తరిమి కొట్టాలని చెప్పిండు.. ఇక్కడోడు తప్పు చేస్తే పాతరేయాలని చెప్పిండు.. కాళోజీ స్పూర్తితో కేసీఆర్ పాలనకు పాతరేయండి.
వచ్చేది బీజేపీ ప్రభుత్వమే... అధికారంలోకి రాగానే పంచాయతీలకు అధికారాలివ్వడంతోపాటు కేంద్రంతో మాట్లాడి నిధులు తీసుకొస్తాం. పంచాయతీలను బలోపేతం చేస్తాం...
కేసీఆర్ బిడ్డ లిక్కర్ దందా కోసం నిధులు ఉంటాయి. మరి ఖమ్మం సహా తెలంగాణ ప్రజలేం చేశారు? డబుల్ బెడ్రూం ఇండ్లు ఎందుకు ఇవ్వడం లేదు? మోదీ 10 లక్షల ఉద్యోగాలిచ్చేందుకు సిద్ధమైండు. ఇప్పటికే 3 లక్షల 70 వేల ఉద్యోగాలిచ్చిండు.. మరి కేసీఆర్ ఉద్యోగాలెందుకు భర్తీ చేయడం లేదో నిలదీయండి.
ఖమ్మం ఉద్యమాల ఖిల్లా... చైతన్యవంతమైన జిల్లా... కేసీఆర్ ఇక్కడ ఎట్లాంటి దీక్ష చేసిండో తెలుసా? ఇక్కడ బరితెగించి బలుపెక్కి ఆసుపత్రిలో ఉండి మందు తాగిన మూర్ఖుడు.. నటనలో జీవించే వ్యక్తి కేసీఆర్. మీడియా కన్పిస్తే చనిపోయిన శవం లెక్క పడుకుంటడు.. మీడియా లేకుంటే లేచి మందు తాగిన మూర్ఖుడు. ఇది తెలిసి ఉస్మానియా, కాకతీయ విద్యార్థులు భగ్గుమన్నరు. వాళ్ల దెబ్బకు భయపడి తోకముడిచిన దొంగ కేసీఆర్. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పెడితే పాల్గొనని వ్యక్తి కేసీఆర్. బీజేపీ సపోర్ట్ చేస్తేనే తెలంగాణ వచ్చింది.
ఇయాళ ఓ సెక్షన్ మీడియా కాంగ్రెస్, బీఆర్ఎస్ ను కలిపేందుకు, ఆ పార్టీల గ్రాఫ్ పెంచేందుకు నానా తంటాలు పడుతున్నయ్. నేను మీడియాకు వ్యతిరేకం కాదు.. వాళ్లంటే నాకు చాలా గౌరవం ఉంది. దయచేసి ప్రజల పక్షాన పోరాడుతున్నదెవరో... ఎన్నికల్లో ఏ పార్టీలకు ఎన్ని ఓట్లు వచ్చాయో విశ్లేషణలు చేయాలని కోరుతున్నా. ఎవరెన్ని చెప్పినా ఎగిరేది కాషాయ జెండానే.
ఈరోజు గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్ర నిధులవల్లే. గ్రామాల్లో నిర్మించిన రైతు భవనాలు, ప్రక్రుతి వనాలు, టాయిలెట్లు, స్మశాన వాటికలు సహా రోడ్లు, లైట్లన్నీ కేంద్రం చలువే.
బండి సంజయ్ వరాల జల్లు
బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలందరికీ ఉచితంగా విద్య, వైద్యం అందిస్తాం. నిలువ నీడలేని వాళ్లందరికీ ఇండ్లు కట్టిస్తాం. ఫసల్ బీమా అమలు చేసి రైతులను ఆదుకుంటాం. ఏటా జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసి ఖాళీలను భర్తీ చేస్తాం. పేదల రాజ్యంతోనే తెలంగాణ బాగుపడుతుంది. రామరాజ్యం రావాలంటే యువత 5 నెలల సమయం ఇవ్వండి. బీజేపీని అధికారంలోకి తీసుకొస్తాం. పొరపాటున బీఆర్ఎస్ కు అవకాశమిస్తే యువత సూసైడ్ నోట్ రాసుకోవడమే. మీకు కొలువులు కావాలంటే... కమలం రావాలి. అందుకోసం గర్జిద్దాం. గాండ్రిద్దాం. ఖమ్మం జిల్లాలో కాషాయ జెండాను ఎగరేసి తీరుతాం అని బండి సంజయ్ ధీమా వ్యక్తంచేశారు.