భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి గురువారం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సాయంత్రం 5:05 నిమిషాలకు కన్నుమూశారు. వాజ్‌పేయి గౌరవార్థం వారం రోజులు సంతాప దినాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకూ సమాచారం పంపారు. . ఇదిలా ఉండగా.. ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ పలువురు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.
ఢిల్లీలోని వాజ్ పేయి నివాసానికి ప్రముఖులతో పాటు అభిమానులు, కార్యకర్తల తాకిడి పెరిగింది. తమ అభిమాన నేతకు నివాళులు అర్పించేందుకు ఉదయం నుంచే పలువురు ప్రముఖులతో పాటు అభిమానులు క్యూ కట్టారు. అటు వాజ్‌పేయి పార్థివదేహాన్ని తరలించడానికి ఆర్మీ వాహనాలు సిద్ధంగా చేయగా.. ఉదయం 9 గంటలకు పార్థివ దేహాన్ని బీజేపీ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లనున్నారు.
బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద మధ్యాహ్నం 1 గంట వరకూ నేతలు, అభిమానులు, కార్యకర్తలు నివాళులర్పిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి అటల్ బిహారీ వాజ్‌పేయి అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. యమునా నది ఒడ్డున సాయంత్రం 5 గంటలకు రాష్ట్రీయ స్మృతిస్థల్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నేడు ఢిల్లిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.