Janasena-TDP Alliance: "ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వం.. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఉంటాయి.. బలమున్న పార్టీలతో కలిసే పోటీ చేస్తాం.. నేను సీఎం పదవికి కండీషన్లు పెట్టను.." గత కొద్దిరోజుల కిందట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇవి. జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తుపై క్లియర్ కట్‌గా హింట్ ఇచ్చేశారు. వచ్చే ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని ఇప్పటికే ప్రజల్లో ఓ అభిప్రాయం ఏర్పడింది. అందుకు తగినట్లుగానే అధికార వైఎస్సార్సీపీ ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా ప్రతి సభలోనూ జనసేన-టీడీపీని కలిపి విమర్శలు చేస్తున్నారు.
అయితే పొత్తులపై అంతా ఒకే అనుకుంటున్న సమయంలో తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి. "పొత్తుల గురించి ఆలోచించేందుకు సమయం ఉంది.. ఒంటరిగా వెళ్లాలా.. కలసి వెళ్లాలా అనేది తరువాత మాట్లాడుకునే విషయం. మండల స్థాయిలో సమగ్ర అధ్యయనం తర్వాతే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామం.. మనం బలంగా పని చేస్తే అధికారం దానంతట అదే వచ్చి తీరుతుంది.." అంటూ కామెంట్స్ చేశారు. దీంతో రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చ మొదలైంది. ఇన్నాళ్లు పొత్తులు ఉంటాయని ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్.. సడెన్‌గా తరువాత మాట్లాడుకునే విషయం అనడంపై రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పవన్ యూటర్న్ తీసుకున్నారా..? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం పొత్తులపై చర్చ కంటే ప్రజల్లోకి జనసేనను మరింత బలంగా తీసుకెళ్లడంపై పవన్ దృష్టిసారించారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో వారాహి యాత్ర ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకుని.. ప్రభుత్వానికి చెక్ పెడతారని వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పొత్తులపై హాట్ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది.
ఆదివారం నుంచి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర రెండో దశ ప్రారంభకానుంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వారాహి విజయ యాత్ర సాగిన నియోజకవర్గాల ఇంఛార్జులు, పరిశీలకులతో శనివారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం అయ్యారు. నేటి నుంచి ప్రారంభం కాబోయే వారాహి విజయ యాత్ర మలి దశకు ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించాలని పవన్ కోరారు. తొలి దశ వారాహి విజయ యాత్రకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.
“జనసేన పార్టీ ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. ఎలాంటి సమస్యపై మనం మాట్లాడినా అది ప్రజల్లోకి చేరిపోతోంది. పార్టీ ప్రజల్లోనే ఉంది. ఉభయ గోదావరి జిల్లాల్లో అది మరింత బలంగా ఉంది. యాత్రకు జనం వస్తున్నారు నాయకత్వం దాన్ని అందిపుచ్చుకోవాలి. వారాహి విజయ యాత్ర విజయం తాలూకు పునాదులను ఆసరాగా చేసుకుని ముందుకు వెళ్లాలి. ఆంధ్రప్రదేశ్‌లో రూల్ ఆఫ్ లా నాశనం అయిపోయింది. ఏ పార్టీ అయినా రూల్ ఆఫ్ లాకి కట్టుబడి పని చేయాలి. వైసీపీ దాన్ని పూర్తిగా విస్మరించింది. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనే అంశాన్ని అవివేకంతో మాట్లాడడం లేదు. జగన్ రెడ్డి, వైసీపీ నాయకులు వెళ్లే మార్గం తప్పు. వైసీపీ పాలనలో అవినీతి తారా స్థాయికి చేరిపోయింది.
వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో మనం రోడ్ల మీదకు రావాల్సి వచ్చింది. వైసీపీని ఎన్నుకున్న వారం రోజుల్లోనే ప్రజలకు చేసిన తప్పు అర్థం అయిపోయింది. కొంత మందికి ఒక్క రోజులోనే అర్థమైపోయింది. ఇప్పుడు 70 శాతం ప్రజలకు తెలిసిపోయింది. రాష్ట్రంలో గంజాయి విక్రయాలు పెరిగిపోయాయి. 30 వేల మంది అమ్మాయిలు మిస్సయ్యారు. ఈ అంశం మీద కనీసం రివ్యూ చేసే పరిస్థితులు లేవు. ఇది చాలా పెద్ద సమస్య. అయినా ఈ అంశం మీద కనీసం ఎవరూ మాట్లాడరు. ఇలాంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోలేకపోతే రాష్ట్రం అధోగతిపాలవుతుంది. రాష్ట్రానికి స్థిరత్వం తీసుకురావడమే వచ్చే ఎన్నికల తాలూకు ముఖ్య ఉద్దేశం” అని పవన్ కళ్యాణ్ అన్నారు.
Also Read: Salaar Movie: సలార్ సినిమాపై పెరిగిన అంచనాలు, 2000 కోట్లు దాటేస్తుందా
Also Read: Yatra 2 Movie: యాత్ర 2 సినిమాపై ఎవరేమనుకున్నా ఫరవాలేదు, ఎన్నికల ముందే విడుదల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి