YS Sharmila Takes A Dig At Minister KTR : రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ పంపిణి విషయంలో కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. 24 గంటల ఉచిత విద్యుత్ అనేది మాటలకే పరిమితం అయింది కానీ ఎక్కడా అమలుకు నోచుకోలేదు అని కాంగ్రెస్ పార్టీ వాదిస్తుండగా.. తమ పార్టీనే రైతులకు తొలిసారిగా 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందించింది అని బీఆర్ఎస్ పార్టీ బల్లగుద్ది మరీ వాదిస్తోంది. కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న ఆరోపణలను తిప్పికొడుతూ మంత్రి కేటీఆర్ గురువారం ట్విటర్ ద్వారా రైతులకు ఓ సందేశం ఇచ్చారు. రైతులను రాజులను చేసిన కేసీఆర్ కావాలో లేక రైతులను ఇబ్బంది పెట్టే కాంగ్రెస్ పార్టీ కావాలో తేల్చుకునే సమయం ఆసన్నమైంది అని రైతులకు సూచించారు. ఇరు పార్టీల మధ్య జరుగుతున్న ఈ మాటల యుద్ధంలో మరోసారి వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పక్షమే పుచ్చుకున్నారు.
ఇటీవల ఖమ్మం బహిరంగ సభలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు బీఆర్ఎస్ మంత్రులు ప్రత్యారోపణలకు దిగిన సందర్భం తెలిసిందే. అయితే, ఆ సందర్భంలోనూ వైఎస్ షర్మిల తెలంగాణ ప్రభుత్వంపై, మంత్రులపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలకు తమ వంతు మద్ధతు అందించారు. తాజాగా ఉచిత విద్యుత్ సరఫరా విషయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు చేసిన వ్యాఖ్యలకు మద్ధతుగా మరోసారి మంత్రి కేటీఆర్ పై వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు.
పచ్చ కామెర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తదన్నట్లుంది కేటీఆర్ తీరు అంటూ వైఎస్ షర్మిల మండిపడ్డారు. రైతును రాజును చేసినం అని ప్రగల్భాలు పలికే చిన్న దొరా.. రైతు ఎట్లా రాజయ్యిండో సమాధానం చెప్పాలే అని డిమాండ్ చేసిన వైఎస్ షర్మిల.. 31 లక్షల మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టినందుకు రాజులయ్యిండ్రా ? లేక ఎరువులు ఫ్రీ అనే ఉత్తమాటలు చెప్పినందుకు రైతును రాజును చేసినట్లా ? అని ప్రశ్నించారు. రూ.14 వేల కోట్ల పంట నష్టపరిహారం ఎగ్గొడితే రైతులు రాజులయ్యారా ? లేక ముష్టి రూ.5 వేలు ఇచ్చి రూ.35 వేల సబ్సిడీ పథకాలు బంద్ పెడితే రైతును రాజు చేసినట్లా ? అని నిలదీశారు.
24 గంటల ఉచిత విద్యుత్ అని చెప్పి పట్టుమని 8 గంటలు కూడా ఇవ్వని పాలన రారాజు పాలన అని ఎలా అంటారు అని మంత్రి కేటీఆర్ ని ప్రశ్నించిన షర్మిల.. రైతు రాజైతే పదేండ్లలో 9 వేల మంది రైతుల చావులు ఎట్లా జరిగినయ్ ? అని నిలదీశారు. వరి వేస్తే ఉరి అని చెప్పిన మీ దరిద్రపు పాలన.. ఆగమైన వ్యవసాయానికి ఆత్మహత్యలే శరణ్యమనడానికి నిదర్శనం కాదా అని వ్యాఖ్యానించారు. బ్యాంకులు ఇచ్చిన పంట రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఆ పనిచేయకపోవడంతో ఆ రుణాలు కట్టలేక రైతులు రాజులను కాదు.. బ్యాంకుల దగ్గర మోసగాళ్లను చేశారు అని మండిపడ్డారు.
మీ ప్రభుత్వం చేస్తోన్న పరిపాలనలో రైతును రాజు చేయలేదని.. బ్యాంకుల వద్ద రైతును దొంగలను చేసిందని అన్నారు. తెచ్చిన అప్పులకు పెళ్ళాం పుస్తెలు సైతం అమ్ముకునేలా చేశారని మండిపడ్డారు. పండించిన పంటకు గ్యారెంటీ లేక రైతుల మెడకు ఉరి తాడేశారు. కలో గంజో తింటూ ఉన్న భూమిని నమ్ముకుంటే.. ధరణి పేరుతో భూములు గుంజుకొని రైతులను రోడ్డున పడేశారన్నారు. రైతు అనేవాడు 59 ఏళ్లలోపు చనిపోవాలని మరణ శాసనం రాశారు. రైతుల చావుల్లో దేశంలోనే నెంబర్ 1... ఇదేనా రైతును రాజును చేసే పరిపాలన అంటూ ప్రభుత్వాన్ని, మంత్రి కేటీఆర్ ని వైఎస్ షర్మిల నిలదీశారు.
కేసీఆర్ పుట్టింది రైతుల కోసం కాదు. రైతులను పాడే ఎక్కించడానికి. ఈ దేశపు గడ్డ మీద రైతును రారాజు చేసింది మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక్కడే. ఉచిత విద్యుత్ ఇచ్చి వ్యవసాయాన్ని పండుగ చేశాడు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారమే రుణమాఫీ చేసి రైతులను బ్యాంకు రుణాల నుంచి రుణ విముక్తులను చేశాడు. సబ్సిడీ పథకాలు ప్రవేశ పెట్టి రైతులకు విలువ తెచ్చాడు. రైతులు కూడా ఊహించని గిట్టుబాటు ధర కల్పించాడు. పంట నష్టం జరిగితే పండించిన దానికన్నా రెండింతలు ఎక్కువే పంట నష్టపరిహారం అందించాడు. ఆ మహానేత పాలన రైతాంగం చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయంగా నిలిచిపోతుంది. రైతే రాజు అంటే అది కదా అని మంత్రి కేటీఆర్‌కి వైఎస్ షర్మిల చురకలంటించారు.
కాంగ్రెస్ పార్టీ సైతం అడపాదడపా అవకాశం వచ్చిన ప్రతీసారి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు తల్చుకుంటూనే తమ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే రైతును రాజును చేసింది అని చెబుతూ వస్తోంది. అందుకు కారణం సహజంగానే ఆనాడు వైఎస్ఆర్ చనిపోయేవరకు, ఇంకా చెప్పాలంటే తను బతికినంత కాలం చివరి నిమిషం వరకు కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగి, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికే పాటు పడి ఉండటమే అయ్యుండవచ్చు. అందువల్లే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు వైఎస్ జగన్ ఏపీలో ఒక పార్టీ పెట్టినా, తెలంగాణలో ఆయన కుమార్తె వైఎస్ షర్మిల మరొక పార్టీ పెట్టినా.. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ మహా నేతను సొంతం చేసుకోవడం ఆపడం లేదు.
ఇది కూడా చదవండి : KTR About Revanth Reddy: 3 గంటల మాటెత్తితే.. రైతుల చేతిలో మాడు పగలడం ఖాయం
బహుషా ఈ విషయమై వైఎస్ షర్మిలను ఆకర్షించిందో లేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే భావసారూప్యం ఉన్న పార్టీలతో కలిసి వెళ్లాలి అనే ఆలోచన వల్లనే కావచ్చు.. ఇలా కారణాలు ఏవైనప్పటికీ.. మీడియాలో వార్తా కథనాలు వస్తున్నట్టుగా వైఎస్సార్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది అనే వాదనలు మాత్రం తరచుగా తెరపైకొస్తూనే ఉన్నాయి.. వైఎస్ షర్మిల వైఖరి అందుకు బలాన్ని చేకూరుస్తూనే ఉంది.
ఇది కూడా చదవండి : Revanth Reddy Counter to KTR: 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాపై రేవంత్ రెడ్డి ప్రకటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK
YS Sharmila to KTR: మరోసారి కాంగ్రెస్ ఆరోపణలకు మద్ధతిచ్చిన షర్మిల- కేటీఆర్‌కి చురకలు