Ponguleti Srinivas Reddy About Land Kabja Allegations: తనకు ప్రచార కమిటీ కో చైర్మన్ గా బాధ్యతలు ఇచ్చిన ఏఐసీసీ, పీసీసీ నేతలకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి కష్టపడి పనిచేస్తాను అని అన్నారు. తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా ఆశించిన స్థాయిలో రాష్ట్రం అభివృద్ధి జరగడం లేదు. కల్వకుంట్ల కుటుంబం పరిపాలన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందనివ్వడం లేదు. హామీలు ఇవ్వడం తప్ప వాటిని అమలు చేయడం లేదు. సంక్షేమ పథకాలను లాంచింగ్ చేయడం తప్ప వాటిని అమలు చేయడం లేదు అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చినప్పటికీ.. రాష్ట్ర ప్రజలకు ఒరిగింది ఏమిలేదు. బిఆర్ఎస్ నేతలు అధికార మదంతో మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తెచ్చింది మేమే అని చెప్పుకుంటూ, ప్రజలను మభ్యపెట్టి రెండుసార్లు అధికారంలోకి వచ్చారు కానీ కేసీఆర్ దీక్ష చేస్తేనే రాష్ట్రం వచ్చిందా ? సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుంటే అసలు కల్వకుంట కుటుంబం ఎక్కడ ఉండేది అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు.
మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తరహాలో ఇష్టారీతిన హామీలు ఇవ్వడం లేదు. ఆచరణకు సాధ్యమైన హామీలనే ఇస్తోంది. తాను 20 గుంటల భూమి కబ్జా చేసానంటే ఎవరైనా నమ్ముతారా ? నాపై బురదజల్లే ప్రయత్నం జరుగుతోంది. తామే న్యాయస్థానాన్ని ఆశ్రయించామన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. తాను కబ్జా చేసినట్లు తేలితే.. నా భూమి మొత్తం రాసిస్తా అని అన్నారు.
యస్ఆర్ గార్డెన్ పడగొట్టాలని చూశారు
యస్ఆర్ గార్డెన్ పడగొట్టాలని చూశారు. యస్ఆర్ గార్డెన్ కట్టి 13 సంవత్సరాలు అయింది. అప్పుడే ఎందుకు సర్వే చేయలేదు. ఇప్పుడు పార్టీ మారాననో.. నిజాలు మాట్లాడుతున్నాననో రాజకీయ కక్ష్య సాధింపు చర్యలకు దిగుతారా అని పొంగులేటి ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఒకలా... పార్టీ మారాక ఇప్పుడు మరోలా ఉంటుందా అని కేసీఆర్ని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీపై విమర్శల దాడి పెరిగిందంటేనే.. కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని అర్థం అయింది బీఆర్ఎస్ పార్టీ చేస్తోన్న ఆరోపణలను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు.