Can we stop eye flu spreading with sun glasses: సన్ గ్లాసెస్ కానీ లేదా ముదురు రంగులో ఉన్న కళ్లద్దాలు ధరించడం ద్వారా కండ్ల కలక ఒకరి నుండి మరొకరికి వ్యాపించకుండా నిరోధిస్తుందా అనే సందేహం చాలామందిని వెంటాడుతోంది. అందుకు కారణం కండ్ల కలకతో బాధపడే వారిని నల్ల రంగు కళ్లద్దాలు ధరించాల్సిందిగా వాళ్లు, వీళ్లు సూచిస్తుండటమే. కండ్లకలక కేసులు తొలుత దేశ రాజధాని ఢిల్లీలో ఎక్కువగా నమోదైనప్పటికీ .. ఆ తరువాత క్రమక్రమంగా దేశం నలుమూలలా కండ్ల కలక కేసులు వెలుగుచూస్తున్నాయి. హైదరాబాద్ లోని సరోజిని దేవి కంటి ఆసుపత్రికి సైతం కళ్ల కలకతో బాధపడుతూ వస్తోన్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడా ఈ కేసులు వెలుగుచూస్తున్నాయి.
కండ్లకలక సోకినప్పుడు సదరు వ్యక్తుల కళ్ళు సున్నితంగా తయారవుతాయి. ఎక్కువ వెలుతురును, ఎక్కువ వేడిని తట్టుకోలేవు కనుక సన్ గ్లాసెస్ ధరించడం వల్ల ఆ అసౌకర్యాన్ని కొంతమేరకు అధిగమించే అవకాశం ఉంటుంది. కండ్లకలక సోకిన వాళ్లు మరొకరిని చూస్తే వారికి కూడా కళ్ల కలక సోకుతుంది అని అనుకోవడం ఒక అపోహ మాత్రమే.
అలాగే కండ్ల కలక ఒకరి నుండి మరొకరికి సోకకుండా ఉండాలంటే సన్ గ్లాసెస్ ధరించాలి అని అనుకోవడం కూడా అంతే పొరపాటు. ఎందుకంటే గ్లాసెస్ ధరించడం ద్వారా కండ్ల కలక సోకిన వారికి కొంత రిలీఫ్ ఉంటుండ వచ్చునేమో కానీ వారి నుంచి మరొకరికి సోకకుండా ఉంటుంది అనుకోవడం మాత్రం అపొహే అవుతుంది.
కళ్ల కలక సోకిన వాళ్లు సన్ గ్లాసెస్ ధరించడం వల్ల వారు తమ కంటిని అదే పనిగా రుద్దడం కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. కండ్లకలక కూడా ఒక అంటువ్యాధి లాంటిదే. కండ్ల కలక సోకిన వారు తాకిన వస్తువులను ఉపయోగించడం ద్వారా అది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. కండ్ల కలక సోకన వారు తమ కళ్లను రుద్దుతూ మరొకరికి కాంటాక్టులోకి రావడం వల్ల అది మరొకరికి సోకే అవకాశం ఉంది కానీ కేవలం కండ్ల కలక సోకిన వాళ్లు మరొకరిని చూసినంతమాత్రాన్నే వచ్చే అవకాశం లేదు. కండ్లకలక తీవ్రతను బట్టి ఏడు రోజులు నుండి 10 రోజుల వరకు ఉంటుంది.