Chandrababu Pulivendula Tour: ఏపీ సీఎం వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో జరిగిన బహిరంగ సభలో జగన్ ని లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు నాయుడు పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ చేసిన పాపాలు ఊరికే పోవని... సాగునీటి ప్రాజెక్టులు విధ్వంసం అయ్యేలా ఏపీ సర్కారు కొనసాగిస్తున్న పరిపాలనపై యుద్ధ భేరి ప్రకటించిన టీడీపీ.. అందులో భాగంగానే తాను కడప జిల్లాకు వచ్చాను అని అన్నారు. వై నాట్ పులివెందుల అని బిటెక్ రవి అన్నారు. అందుకే ఇక్కడకొచ్చానన్నారు. రాయలు ఏలిన సీమ రతనాల సీమ ఇప్పుడు వెనుకబడిపోయిందన్నారు. 1983 లో నందమూరి తారక రామారావు సిఎం అయ్యాక రాయలసీమకు నీటి కష్టాలు తీరాయి అని గుర్తుచేసుకున్న చంద్రబాబు నాయుడు.. రాయల సీమకు నీళ్లు ఇచ్చాక చెన్నైకి వెళ్ళాలి అన్న వ్యక్తి నందమూరి తారకరామారావు అని స్వర్గీయ నందమూరి తారకరామారావును కొనియాడారు.
2015 లో పులివెందులలో నీళ్లు లేవు. నీళ్లు తెచ్చి రైతుల కష్టాలు తీర్చాము. గండికోట నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇచ్చిన ఘనత కూడా టీడీపీదే. ఇప్పుడున్న ముఖ్యమంత్రి డబ్బులు కొట్టేయడానికి గండికోట నుంచి సొరంగం కొడుతున్నాడు. మూడేళ్లు అవుతున్నా పనులు ముందుకు సాగడం లేదు. రాయలసీమ కు నీళ్లు ఇచ్చాము. కొంచెం నీళ్లు ఇస్తేనే రైతులు బంగారం పండిస్తున్నారు. అలాంటిది వారి అవసరాలకు సరిపడా నీరు అందిస్తే ఇంకెంత బాగుంటుందో చెప్పండని సభకు హాజరైన వారిని ఉద్దేశించి ప్రశ్నించారు.
టీడీపీ ప్రభుత్వం వచ్చాక శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహాన్ని గండికోటలో పెట్టిస్తాం. జగన్ రాయలసీమ ద్రోహి. రాయలసీమను రతనాల సీమ చేస్తా. సైకో జగన్ నాకు వయస్సు అయిపొయింది అంటున్నాడు. సింహం ఎప్పటికి సింహమే అని వ్యాఖ్యానించారు. పులివెందులకు నేషనల్ హై వే వస్తుంది అంటే అది టీడీపీ ఘనత. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో డిజిటల్ కరెన్సీ ఐడియా ఇచ్చింది నేనే అని అన్నారు. అమరావతి రాజధాని ఉండాలని ఆశించాను. కానీ విశాఖ రాజధాని ఉండాలంటున్న జగన్ ఆంధ్రప్రదేశ్‌కే ఇప్పుడు రాజధాని కూడా లేకుండా చేశాడు అని ఆవేదన వ్యక్తంచేశారు. టీడీపీ సభలకు జనం కరువయ్యారు అని చెబుతున్న జగన్ వచ్చి సభకు వచ్చిన ఈ జనాలను చూడాలి అని అన్నారు.
రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరాన్ని సిఎం జగన్ నాశనం చేశారని.. రివర్స్ టెండరింగ్ వల్ల ఇప్పుడు రాష్ట్రమే రివర్స్ లో ఉంది అని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్రం మనకు ఇచ్చిన వరం పోలవరం. నేను పట్టుకుంటే ఉడుము పట్టే. రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరిచ్చే బాధ్యత నాది అంటూ భారీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుపైనా విమర్శలు చేశారు. ఇరిగేషన్ మంత్రి ఆంబోతు రాంబాబు అంటూ మండిపడ్డారు. రైతే రాజు కావాలి అని పిలుపునిచ్చిన చంద్రబాబు నాయుడు.. మైక్రో ఇరిగేషన్ సబ్సిడీ 90 శాతం మళ్ళీ పులివెందుల కు ఇస్తానని హామీ ఇచ్చారు. మండలానికి ఒక అన్నా క్యాంటిన్ పెడతాం. టీడీపీ ప్రభుత్వం అన్నం పెడితే జగన్ మాత్రం ప్రజలకు సున్నం పెడుతున్నాడు అని ఆవేదన వ్యక్తంచేశాడు. ఏపీకి ఒంటిమిట్ట రామాలయం మరో భద్రాచలం లాంటిది కానీ జగన్ ప్రభుత్వంలో ఒంటిమిట్ట రాములోరికి కూడా నిర్లక్ష్యం జరుగుతోంది అని ఆరోపించారు.