Hyderabad Metro: మెట్రో రైల్ విస్తరణపై వేగంగా అడుగులు.. మాస్టర్ ప్లాన్‌పై మంత్రి కేటీఆర్ రివ్యూ

KTR Review Meeting on Hyderabad Metro Rail Master Plan: హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణ మాస్టర్ ప్లాన్‌పై మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలో రద్దీ, కాలుష్యం తగ్గేలా మెట్రో విస్తరిస్తున్నట్లు చెప్పారు. విశ్వ నగరంగా మారాలంటే ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతం కావాలన్నారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Aug 10, 2023, 05:50 PM IST
Hyderabad Metro: మెట్రో రైల్ విస్తరణపై వేగంగా అడుగులు.. మాస్టర్ ప్లాన్‌పై మంత్రి కేటీఆర్ రివ్యూ

KTR Review Meeting on Hyderabad Metro Rail Master Plan: హైదరాబాద్ నగరం మెట్రో రైల్‌ విస్తరణపై వేగంగా అడుగులు పడుతున్నాయి. మాస్టర్ ప్లాన్, ఎయిర్‌ పోర్ట్ మెట్రో వ్యవస్థపై మంత్రి కేటీఆర్ మెట్రో రైల్ భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎస్ శాంతి కుమారితో పాటు పలువురు శాఖధిపతులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను భారీగా విస్తరిస్తూ.. బలోపేతం చేయాలన్న దిశగా ప్రణాళికలను సిద్ధం చేస్తోందని కేటీఆర్ అన్నారు. ఈ దిశగా మెట్రో రైల్ విస్తరణ పనులను కూడా ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్ రద్దీని, కాలుష్యాన్ని తగ్గిస్తూ విశ్వ నగరంగా మార్చాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని అన్నారు. ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా నగరానికి మరిన్ని భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం కేటీఆర్ అభిప్రాయపడ్డారు. 

మెట్రో రైల్ విస్తరించే ప్రణాళికలను సిద్ధం చేస్తూనే ప్రస్తుతం మెట్రో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కారిడార్లలో మరిన్ని అదనపు కోచ్‌లని పెంచాలని ఆయన సూచించారు. మెట్రో లాస్ట్ మైల్ కనెక్టివిటీపైన దృష్టిసారించి మరిన్ని ఫీడర్ సర్వీస్‌లను ప్రారంభిస్తే ప్రస్తుతం ఐదు లక్షల మంది ప్రయాణిస్తున్న మెట్రో సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. 

మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఎయిర్‌ పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ వేతో పాటు ప్రభుత్వం ప్రకటించిన మెట్రో రైల్ మాస్టర్ ప్లాన్‌పై తమ వద్ద ఉన్న ప్రణాళికలపై సవివరమైన ప్రజెంటేషన్ ఒకదాన్ని అందించారు. హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి దశను అనేక సవాళ్ళను దాటుకొని విజయవంతంగా పూర్తి చేసి కార్యకలాపాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా మెట్రో రైల్ మొదటి దశ నిర్మాణంలో ఎదురైన సవాళ్లను, సమస్యలను వివరించి అదేవిధమైన సమస్యలు తదుపరి మెట్రో నిర్మాణ దశల్లో ఎదురైతే అధిగమించేందుకు అందుబాటులో ఉన్న పరిష్కారాలను మెట్రో రైల్ ఎండీ వివరించారు. 
 
ఎయిర్‌ పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్‌ వే పై ప్రధానంగా చర్చించిన మంత్రి కేటీఆర్.. పలు కీలక ఆదేశాలను జారీ చేశారు. జీఎంఆర్ ఆధ్వర్యంలోని ఎయిర్‌ పోర్ట్ అథారిటీ వర్గాలు వెంటనే  48 ఎకరాల స్థలాన్ని మెట్రో డిపో కోసం కేటాయించాలన్నారు. మెట్రో విస్తరణ ప్రణాళికలపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఎస్‌ను కోరారు. లక్డీకపూల్ నుంచి బీహెచ్ఈఎల్, ఎల్బీనగర్ నుంచి నాగోల్ వరకి విస్తరించాలనుకుంటున్న మెట్రో మార్గానికి కేంద్ర ప్రభుత్వం నుంచి 9 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంలో కొంత ఆర్థిక సహాయాన్ని ఇప్పటికే అడిగామన్నారు. దీనికి సంబంధించిన అంశాన్ని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

తాజాగా మెట్రో లైన్‌ని భారీగా విస్తరించాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు ఆయా మార్గాలలో వెంటనే అవసరమైన సర్వేలను చేపట్టి ప్రాథమిక రిపోర్టులను, తర్వాత డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టలను సిద్ధం చేయాలని మంత్రి కేటీఆర్ మెట్రో రైల్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశం అనంతరం ఎంఐఎం శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ మంత్రి కేటీఆర్‌తో సమావేశం అయ్యారు. పాతబస్తీ మెట్రో కారిడార్ పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. పాతబస్తీ మెట్రో కారిడార్‌కు అవసరమైన భూ సేకరణ ప్రక్రియను చేపట్టామని త్వరలోనే కారిడార్ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు మెట్రో అధికారులు. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి ఫలన్‌నుమా వరకు ఉన్న ప్రస్తుత ఎయిర్‌పోర్ట్ మెట్రో కారిడార్‌ను శంషాబాద్ విమానాశ్రయం వరకు పొడిగించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని మెట్రో అధికారులకు కేటీఆర్ సూచించారు.

Trending News