న్యూఢిల్లీ: దీపావళి పండగ వచ్చేస్తోంది. ఈ దీపావళి పండగకు ముందే ప్రభుత్వాలు ఉద్యోగులకు వేతనాలు పెంచనున్నాయి. భారత దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను పెంచుతూ ప్రకటనలు చేశాయి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏడవ వేతన సంఘం సిఫార్సుల మేరకు వేతనాన్ని పొందుతున్నారు. కానీ కొన్ని రాష్ట్రాలు ఇంతవరకూ ఏడవ వేతన సంఘం సిఫార్సులను అమలు చేయలేదు. అయితే కొన్ని రాష్ట్రాలు ఏడవ వేతన సంఘం సిఫార్సులను అమలుచేయనున్నట్లు ప్రకటించాయి.
హర్యానా: తాజాగా ప్రభుత్వ ఉద్యోగులకు 2శాతం కరువు భత్యం(డీఏ) పెంచుతున్నట్లు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కొత్త పే స్కేల్ జనవరి 1, 2018 నుండి అమల్లోకి వస్తుంది.
రాజస్థాన్: రాజస్థాన్ ప్రభుత్వం కూడా టీచర్లకు పెద్ద ప్రకటనే చేసింది. రాజస్థాన్ ఉన్నత విద్య మంత్రి కిరణ్ మహేశ్వరి మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీచర్లకు ఏడవ వేతన కమిషన్ సిఫార్సులను అమలు చేయనున్నట్లు ప్రకటించారు. 7 నుంచి 9 శాతం కరువు భత్యం (డీఏ) పెంచుతున్నట్లు తెలిపారు. కొత్త పే స్కేల్ జనవరి 1, 2018 నుండి అమల్లోకి వస్తుంది.
ఛత్తీస్గఢ్: ముఖ్యమంత్రి రమణ్ సింగ్ రాష్ట్ర ప్రభుత్వ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, 100 శాతం నిధులను పొందే ప్రభుత్వేతర కళాశాలల ఉపాధ్యాయులకు ఏడవ వేతన కమిషన్ సిఫార్సులను అమలు చేయనున్నట్లు ప్రకటించారు. జనవరి 1, 2016 నుండి వేతన పెంపును అమల్లోకి తెచ్చారు. దీని వల్ల సిబ్బందికి 32 నెలలు బకాయి లభిస్తుంది.
మధ్యప్రదేశ్: రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నడిచే కళాశాలలోని ప్రొఫెసర్లకు ఏడవ వేతన కమిషన్ సిఫార్సులను అమలు చేయనున్నట్లు శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 1, 2016 నుండి వేతన పెంపును అమలు చేయనుండగా.. సిబ్బంది 32 నెలలు బకాయిలు చెల్లించనున్నారు.
ఉత్తర్‌ప్రదేశ్: ఉత్తర్‌ప్రదేశ్ ఉపాధ్యాయులకు, ప్రభుత్వ సంస్థల ప్రొఫెసర్లకు ఏడవ వేతన కమిషన్ ప్రయోజనాలను ఇవ్వాలని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వానికి రూ.921.54 కోట్లు ఖర్చు అవుతుంది. రాష్ట్ర మరియు సంబంధిత కేడర్ ఉపాధ్యాయులకు కొత్త పే స్కేల్ జనవరి 1, 2016 నుండి అమల్లోకి వస్తుంది. దీంతో వారు కూడా 32 నెలలు బకాయిలు పొందుతారు.
మరోవైపు జమ్మూకాశ్మీర్ టీచర్లు.. ఏడవ వేతన కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలే, రాష్ట్రంలోని 250 మంది ఉపాధ్యాయులు ఢిల్లీలో జీతాల పెంపు కోసం డిమాండ్ చేశారు. అయితే, వారు అధికారుల నుండి హామీ పొందలేదు. ఒకేవేళ సిఫార్సులు అమలైతే.. 41,000 మంది టీచర్లు ప్రయోజనం పొందుతారు.
అటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏడవ వేతన సంఘం సిఫార్సుల కంటే అధికంగా జీతాలను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఫిట్మెంట్ కారకం 2.75 ప్రకారం కేంద్ర ప్రభుత్వోద్యోగులు రూ.18,000 కనీస వేతనాన్ని అందుకుంటున్నారు. అయితే ఫిట్మెంట్ కారకాన్ని 3.68కి పెంచి కనీస వేతనాన్ని రూ.26,000కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇటీవలే ఆగస్టు నెలలో కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం కరువు భత్యాన్ని పెంచి ఉద్యోగులకు ఊరట నిచ్చింది. దీనివల్ల 11 మిలియన్‌ల మంది ఉద్యోగులు, పెన్షనర్లు ప్రయోజనం పొందారు. కేంద్రం తమ డిమాండ్‌లను పరిగణలోకి తీసుకొని వచ్చే ఎన్నికల్లోపు దీనిపై ప్రకటన చేస్తుందని ఉద్యోగులు ఆశిస్తున్నారు.