Yatra 2 Official Trailer Out Now: దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి పాదయాత్ర ఆధారంగా రూపొందిన మూవీ యాత్ర. 2019లో ఈ సినిమా రిలీజ్ అవ్వగా.. సూపర్ హిట్‌గా నిలిచింది. వైఎస్ఆర్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తన నటనతో చెరగని ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్‌గా ‘యాత్ర 2’ తెరకెక్కుతోంది. సీఎం జగన్‌మోహన్ రెడ్డి పాత్రలో హీరో జీవా యాక్ట్ చేస్తుండగా.. మహి వి. రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు. 2009 నుంచి 2019 ఏపీలో జరిగిన రాజకీయ సంఘటనలు ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. యాత్ర మూవీలో వైఎస్ఆర్ పాదయాత్రను ప్రధాన ఘట్టంగా చూపించిన విషయం తెలిసిందే. యాత్ర-2లో జగన్ పాదయాత్రను హైలెట్ చేయనున్నారు. ఇప్పటికే పోస్టర్స్, టీజర్ ఆకట్టుకోగా.. తాజాగా మేకర్స్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 8న థియేటర్లలో ఈ మూవీ సందడి మొదలుపెట్టనుంది.
ఓ సామాన్యురాలు వైఎస్ఆర్ వద్దకు వచ్చి.. తన బిడ్డకు పుట్టుకతోనే చెవుడు ఉందంటూ చెప్పే ఎమోషనల్ డైలాగ్‌తో ట్రైలర్ మొదలవుతుంది. ఏదో మిషిన్ పెడితే వినిపించడంతోపాటు మాటలు వస్తాయని డాక్టర్లు చెప్పారని.. తమకు అంత స్థోమత లేదని తన బాధను చెప్పుకుంటుంది. వైఎస్సార్ మరణం.. కాంగ్రెస్ అధిష్టానాన్ని ధిక్కరించి జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించడం.. ఆ తరువాత జగన్ సొంతంగా పార్టీ పెట్టి ఉప ఎన్నికలకు వెళ్లడం.. జగన్‌ను ఓడించేందుకు కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేయడం వంటివి ట్రైలర్‌లో చూపించారు. జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రకు ప్రజల నుంచి వచ్చిన మద్దతు.. భారీ బహిరంగ సభలకు హాజరైన జనసందోహాన్ని చక్కగా చూపించారు.
'జగన్ రెడ్డి కడపోడు సార్. శత్రువు మీద ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాక వాళ్లు నాశనం అయిపోతారని తెలిసినా.. శత్రువుకు తలవంచరు సార్..' అంటూ చెప్పే డైలాగ్ ఆసక్తికరంగా ఉంది. 'నువ్వు మా YSR కొడుకువు అన్నా.. మాకు నాయకుడిగా నిలబడు అన్నా..’ అని ఓ అంధుడు చెప్పగా.. 'నేను విన్నాను.. నేను ఉన్నాను' అంటూ జగన్ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ఎండ్ అవుతుంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి బయోపిక్ కావడంతో ఈ సినిమా కోసం అటు రాజకీయ వర్గాలు, సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: Kumari Aunty Food Point: కుమారి ఆంటీకి సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. నెట్టిజన్ల ప్రశంసలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook