Rajyasabha Elections 2024: తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సంఖ్యాబలం దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలు కాంగ్రెస్ పార్టీకు, ఒక స్థానం బీఆర్ఎస్కు దక్కనుంది. కాంగ్రెస్ పార్టీ మూడో అభ్యర్ధిని బరిలో దింపుతుందా లేదా అనే సందేహానికి తెరపడింది. ఫలితంగా ముగ్గురి ఎన్నిక లాంఛనం కానుంది.
తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా సంఖ్యాబలం ఆధారంగా కాంగ్రెస్ పార్టీకు రెండు, బీఆర్ఎస్ పార్టీకు ఒక స్థానం దక్కనున్నాయి. కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాలకు పోటీ చేస్తుందని తొలుత భావించినా ఢిల్లీ అధిష్టానం సూచనల మేరకు రెండు స్థానాలకే పరిమితమైంది. ఈ రెండు స్థానాలకు అభ్యర్ధుల్ని కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఓసీ కేటగరీలో కమ్మ సామాజికవర్గానికి చెందిన రేణుకా చౌదరి, బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ పేర్లను ఖరారు చేసింది. ఈ ఇద్దరూ రేపు అంటే గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు.
వాస్తవానికి ఈ ఇద్దరూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం లేదా మల్కాజ్గిరి, సికింద్రాబాద్ స్థానాలు ఆశించారు. అయితే పార్టీకున్న ఇతర ప్రాధాన్యతలు, సమీకరణాల దృష్ట్యా ఈ ఇద్దరినీ రాజ్యసభకు ఎంపిక చేశారు. ఒకటి మహిళకు, మరొకడి బీసీ యువతకు కేటాయించింది పార్టీ. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. అందుకే ఇక్కడ్నించి ప్రాతినిధ్యం ఉండాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ అనిల్ కుమార్ యాదవ్‌ను ఎంపిక చేసింది. వాస్తవానికి ఈ రెండు స్థానాల కోసం సీనియర్ కాంగ్రెస్ నేతలు వీహెచ్, జానారెడ్డి, చిన్నారెడ్డి వంటి నేతలు ప్రయత్నించి విఫలమయ్యారు. మరోవైపు ఒక స్థానాన్ని జాతీయ స్థాయి నేతకు, మరొకటి స్థానికంగా ఇవ్వాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. కానీ రానున్న ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని రెండూ స్థానికులకే ఇస్తే ప్రయోజనం ఉంటుందని పార్టీ భావించింది.
ఇందులో భాగంగానే రెండు స్థానాల్ని స్థానికులకే కేటాయించింది. మూడో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్ధిని ఆ పార్టీ మరి కాస్సేపట్లో ప్రకటించనుంది. దాంతో ఎన్నికకు అవకాశం లేకుండా మూడు స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి.
Also read: APPSC Group 2: అందుబాటులోకి గ్రూప్-2 హాల్ టిక్కెట్స్.. డౌన్ లోడ్ చేసుకోండి ఇలా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook