విజయవాడ: అభ్యర్ధులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తోన్న ఉపాధ్యాయ నియామక పరీక్ష (DSC) 2018కి ఎట్టకేలకు మోక్షం లభించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఏపీ విద్యాశాఖ ప్రకటన విడదల చేసింది. ఈ సారి మొత్తం 7 వేల 675 టీచర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు.
పోస్టుల భర్తీకి సంబంధించి కేటగిరి వారిగా చూసినట్లయితే.. జిల్లా పరిషత్ మరియు మండల పరిషత్ సూళ్లకు సంబంధించి 4 వేల 341 పోస్టులు ఉండగా మున్సిపల్ సూళ్లకు సంబంధించిన 1100 పోస్టులు ఉన్నాయి. అలాగే మోడల్ సూళ్లులో 909 పోస్టులు , గిరిజన పాఠశాలల్లో 800, గురుకుల పాఠశాలల్లో 175 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటిలో ఎస్జీటీ పోస్టులే అధికంగా ఉన్నాయి. ఈ సారి ఎస్జీటీ పోస్టుల్లో బీఎడ్లకు అవకాశం కల్పిస్తున్నందున వీటికి పోటీ భారీగా ఉండే అవకాశం ఉంది. కాగా అభ్యర్ధులు దీనికి సంబంధించి నవంబరు 1 నుంచి 16 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం cse.ap.gov.in వెబ్ సైట్ చూడవచ్చు.
ఆన్లైన్ అప్లికేషన్ల గడువు | నవంబరు 1 నుంచి 16 |
సెంటర్ల ఆప్షన్ల ఎంపిక | నవంబరు 19 నుంచి |
హాల్టికెట్ డౌన్లోడ్ | నవంబరు 29 నుంచి |
స్కూలు అసిస్టెంట్స్ (నాన్ లాంగ్వేజెస్) పరీక్ష | డిసెంబరు 6 |
స్కూలు అసిస్టెంట్స్ (లాంగ్వేజెస్) | డిసెంబరు 11 |
పీజీ టీచర్స్ పరీక్ష | డిసెంబరు 12,13 |
వయెపరిమితి పెంపు | ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏళ్ల వరకు, జనరల్ కేటగిరీ 44 ఏళ్లు |
డిఎస్సీ-2018 నోటిఫికేషన్ను ప్రభుత్వం ఇప్పటికే మూడుసార్లు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ముందుగా అనుకున్న ప్రకారం 15 రోజుల క్రిందటే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. అయితే ఎన్ని పోస్టులు భర్తీ చేయాలి అనే అంశంతో పాటు పలు అంశాలపై స్పష్టత రాకపోవడంతో విద్యాశాఖ అధికారులు వాయిదా వేశారు. అన్ని లెక్కలు సరిచూసుకొని గురువారం షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ.. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ శుక్రవారం విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్ విడుదలపై అభ్యర్ధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.