జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వేటగాడు వాల్మీకిగా మారినట్లే.. చెడు సావాసాల బారిన పడిన వ్యక్తి వేమనలా గొప్ప మనిషిలా మారినట్లే.. చంద్రబాబులో కూడా మార్పు వస్తుందని అనుకున్నానని అన్నారు. అందుకే 2014లో ఆయనకు మద్దతు ఇచ్చానని తెలిపారు. కానీ ఆయన ఇంకా నిద్రలోనే ఉన్నారని.. ఆయన మారుతారన్న నమ్మకం తాను కోల్పోయాను కాబట్టే.. ఇప్పుడు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నానని పవన్ అన్నారు.
తెలుగుదేశం నాయకులకు పౌరుషం అనేది లేదని తాను భావిస్తున్నానని.. పార్లమెంటు తలుపులు మూసేసి మరీ రాష్ట్ర ఎంపీలను అవమానించిప్పుడే కాంగ్రెస్ ఎంతగా దిగజారిందో అర్థమైందని అన్నారు. అలాంటి పార్టీతో తెలుగుదేశం జత కట్టడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఒకప్పుడు గాంధీ మహాత్ముడిని రైల్లోంచి తోసేసి బ్రిటీష్ అధికారులు అవమానించారని.. కానీ ఆయన పట్టుదల వీడకుండా అదే బ్రిటీష్ వారిని తరిమికొట్టే చైతన్యాన్ని ప్రజలలో తీసుకొచ్చారన్నారు. జనసేన కూడా అదే పోరాట స్ఫూర్తిని కలిగుండాలని తెలిపారు.
తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలో జరిగిన సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ కార్యకర్తలతో తన ఆలోచనలను పంచుకున్నారు. కులాల చిచ్చు రేపుతూ రాజకీయాలు చేసే వారిని ప్రజాకోర్టులో నిలదీయాలని.. అలా నిలదీసే పార్టీ జనసేన అని పవన్ అన్నారు. అన్ని కులాలను కలుపుకొని ముందుకు పోవడమే జనసేన పార్టీ లక్ష్యమని.. పార్టీ విలువలను కాపాడడం తన లక్ష్యమని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఓడిపోవడానికైనా సిద్ధపడతాను కానీ.. పార్టీ విలువలను తాను చంపే మనిషికాదని పవన్ తన కార్యకర్తల సమావేశంలో తెలిపారు.