అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ని కలిశారు. మంగళవారం తమ పార్టీ నేతలు నాదేండ్ల మనోహర్, అర్హం ఖాన్, పార్టీ ప్రధాన కార్యదర్శి శివ శంకర్‌లతో కలిసి గవర్నర్‌ని కలిసిన పవన్ కల్యాణ్.. ఏపీలో ఇటీవల వైఎస్ జగన్ తీసుకొచ్చిన ఇసుక పాలసీపై ఫిర్యాదు చేశారు. నూతన పాలసీతో ఇసుక కరువైందని.. ఫలితంగా భవన నిర్మాణరంగంపై ఆధారపడిన కార్మికులు తిండికి తిప్పలు పడుతున్నారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఇసుక సరఫరా పెరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తాము లాంగ్ మార్చ్ చేపట్టినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన కరువైందని ఆవేదన వ్యక్తంచేసిన పవన్ కల్యాణ్.. ఈ విషయంలో మీరు(గవర్నర్) జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని గవర్నర్‌కి విజ్ఞప్తి చేశారు.