న్యూఢిల్లీ: దిశపై సామూహిక అత్యాచారం, హత్య.. గతంలో నిర్భయ అత్యాచారం, హత్య వంటి ఘటనల అనంతరం దేశవ్యాప్తంగా ప్రజల నుంచి విపరీతమైన ఆగ్రహం వ్యక్తమైంది. నిందితులను కచ్చితంగా ఉరి తీయాలనే డిమాండ్లు దేశవ్యాప్తంగా వినిపించాయి. దిశ అత్యాచారం, హత్య కేసులో తెలంగాణ పోలీసులు నిందితులను ఎన్కౌంటర్ చేయడంతో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఏడేళ్ల క్రితం జరిగిన నిర్భయ కేసులోనూ న్యాయం జరగాలనే డిమాండ్లు మళ్లీ తెరపైకొచ్చాయి. ఎట్టకేలకు నిర్భయ కేసులో దోషులకు ఉరి శిక్ష అమలు చేస్తారనే ఊహాగానాలు ప్రారంభమయ్యాయి.
డిసెంబర్ 16న ఉరి శిక్ష అమలు.. !
నిర్భయ కేసులో దోషులకు డిసెంబర్ 16న ఉరి శిక్ష అమలు చేస్తారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇందుకు తీహార్ జైలు ఆపరేషన్స్‌లో జరుగుతున్న పనులు కూడా ఊతమిస్తున్నాయి. దోషులను ఉరి తీసేందుకు తాళ్లు తయారు చేయాలని బీహార్‌లోని బక్సర్ జైలు అధికారులకు సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ప్రస్తుతం తీహార్ జైలులో ముగ్గురు దోషులు అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మ, ముఖేష్ సింగ్ మాత్రమే ఉన్నారు. మరో దోషి పవన్ గుప్తాను మండోలి జైలులో ఉంచారు. ఇప్పుడు అతన్ని కూడా తీహార్ జైలుకు తరలించడంతో వారికి త్వరలోనే ఉరి శిక్ష అమలు చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూరింది.
మరోవైపు దోషులు తమను క్షమించాలని కోరుతూ రాష్టపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పెట్టుకున్న పిటిషన్‌ను తిరస్కరించాలని కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. అటు తీహార్ జైలు అధికారుల విజ్ఞప్తి మేరకు ఉత్తరప్రదేశ్ జైళ్ల శాఖ సైతం ఇద్దరు తలారులను సిద్ధంగా ఉంచిందని తెలుస్తోంది. ఇలా ఒకదాని వెంట ఒకటిగా జరుగుతున్న పరిణామాలు నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలు కానుందనే ప్రచారాన్ని మరింత ఊపందుకునేలా చేస్తున్నాయి.
ఉరి తాళ్లలో బక్సర్ జైలు ప్రత్యేకత..
ఉరి శిక్ష అమలు చేసేందుకు ఉపయోగించే తాళ్ల తయారీలో బక్సర్ జైలుకు ఓ ప్రత్యేకత ఉంది. గతంలోనూ పలు ఉరి శిక్షల అమలు కోసం తాళ్లు తయారు చేసింది ఇక్కడే. అత్యాచారం, హత్య కేసులో ఉరి శిక్ష పడ్డ ధనుంజయ్ ఛటర్జీ కోసం తాళ్లు బక్సర్ జైలులోనే తయారు చేశారు. 2001లో పార్లమెంట్‌పై దాడికి ప్రధాన సూత్రదారుడు అఫ్జల్ గురుకు కూడా బక్సర్ జైలులో తయారు చేసిన ఉరి తాడుతోనే శిక్ష అమలు చేశారు. 1993 బొంబాయి పేలుళ్లలో దోషిగా తేలిన యాకుబ్ మెమెన్ ఉరి శిక్ష అమలు కోసం బక్సర్ జైలు సిబ్బంది తాళ్లు అందించారు. 2008 ముంబై దాడుల కేసులో పట్టుబడ్డ ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను కూడా బక్సర్ జైలులో
తయారు చేసిన తాళ్లతోనే ఉరి తీశారు. ఇప్పుడు నిర్భయ కేసులోనూ ఉరి శిక్ష అమలు కోసం బక్సర్ జైలు అధికారులను తీహార్ జైలు అధికారులు సంప్రదించడంతో ఇక నిర్భయ కేసులో దోషులకు శిక్ష పడినట్టేననే టాక్ బలంగా వినిపిస్తోంది. అంతే కాదు నిర్భయను 2007 డిసెంబర్ 16న దారుణంగా అత్యాచారం చేసి, హత్య చేశారు. దీంతో అదే రోజున శిక్ష అమలు చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది.
తలారి బాధ్యత మాకివ్వండి..
నిర్భయ దోషులను ఉరి తీస్తారన్న ప్రచారం పెరుగుతుండడంతో వారిని ఉరి తీసే బాధ్యత తమకు అప్పగించాలని కోరుతూ దేశవ్యాప్తంగా పలువురు ఔత్సాహికులు తీహార్ జైలు ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. తలారి బాధ్యతలు అప్పగించాలని వారు తమ లేఖల్లో కోరారు. ఢిల్లీ, ముంబై, కేరళ, తమిళనాడు, గురుగ్రామ్ నుంచి లేఖలు వచ్చినట్లుగా తెలుస్తోంది. రెండు లేఖలు విదేశాల నుంచి కూడా వచ్చినట్లు తీహార్ జైలు అధికారులు చెబుతున్నారు.