మానవత్వం ఉన్న గొప్ప దేశం భారత్
చిర్రుబుర్రులాడిన నోటితోనే ప్రశంసలు
మూడు రోజుల్లో వైఖరి మార్చుకున్న ట్రంప్
కొద్ది రోజుల క్రితం భారత్ పై చిర్రుబుర్రులాడిన అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మెత్తబడ్డారు. అంతే కాదు థ్యాంక్యూ మోదీ అంటూ కృతజ్ఞతలు చెప్పారు. పైగా భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇంతకీ పెద్దన్నకు ఎందుకు కోపమొచ్చింది..?
'కరోనా వైరస్' దెబ్బతో అమెరికా విలవిలలాడుతోంది. రోజు రోజుకు పెరుగుతున్న కేసులు అమెరికాను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ .. భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. కరోనా వైరస్ చికిత్సకు ఉపయోగించే మందు యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్ మందు తమకు ఎగుమతి చేయాలని కోరారు. ఐతే ఇది అంత సులభం కాదు కదా..! విదేశాంగ విధానాన్ని మార్చాల్సి ఉంటుంది. అంతకు ముందు ఈ మందుపై ఉన్న ఆంక్షలు పాక్షికంగా సడలించాలి. ఇలా చాలా తతంగం ఉంటుంది. ఈ క్రమంలో అమెరికా అభ్యర్ధనకు కాస్త ఆలస్యమైంది. అంతలోనే ట్రంప్ కు కోపమొచ్చింది. భారత దేశంపై, ప్రధానంగా ప్రధాని మోదీపై చిర్రుబుర్రులాడారు. ఇంకా చెప్పాలంటే నోరు పారేసుకున్నారు. మేం అడిగిన మందు పంపించకుంటే ..
భారత దేశంపై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు..
కానీ ప్రధాని నరేంద్ర మోదీ ఇవేవీ పట్టించుకోలేదు. తన పని తాను చేసుకుంటూ పోయారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మందు కోసం భారత్ ను 30 దేశాలు కోరాయి. ఐతే ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కటే చెప్పారు. దేశీయ అవసరాలకు సరిపోయినంతగా ఔషధాన్ని ఉంచుకుని కచ్చితంగా మిగతా సరుకును ఎగుమతి చేస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా .. దేశీయ అవసరాలకు ఎంత సరిపోతుందో లెక్కగట్టాలని అధికారులను ఆదేశించారు. మిగతాది అమెరికా సహా మిగతా కొన్ని దేశాలకు ఎగుమతి చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో మానవతా హృదయాన్ని చాటుకున్నారు.
I want to thank Prime Minister Modi for allowing us to have what we requested...He was terrific, we will remember it: US President Donald Trump https://t.co/bMxrkYlnGC pic.twitter.com/bhyF6HUism
— ANI (@ANI) April 9, 2020
ఎగుమతిపై ఉన్న ఆంక్షలు పాక్షికంగా తొలగించి హైడ్రాక్సీక్లోరోక్విన్ మందు పంపించడానికి అనుమతులు ఇవ్వడంతో అగ్రరాజ్యం అమెరికా సంతోషించింది. ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ .. ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. ఆయన ఒక బలమైన నాయకుడు. భారత దేశం ఒక గొప్ప మానవత్వం ఉన్న దేశం అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
దటీజ్ ఇండియా..!!