దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ గోదాములో అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. తెల్లవారుజామునే ఘటన జరిగింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.
మొత్తం 30 అగ్నిమాపక వాహనాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. గోదాములో విపరీతంగా ఎగిసిపడుతున్న అగ్నికీలలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐతే మంటలు ఎక్కువగా ఉండడంతో అగ్నిమాపక సిబ్బంది చాలా శ్రమించాల్సి వస్తోంది. స్థానికులు కూడా అగ్నిమాపక సిబ్బందికి సాయం చేస్తున్నారు.
మరోవైపు గోదాములో బట్టలు, ప్లాస్టిక్ వస్తువులు ఉన్న కారణంగా మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. టిక్రీ బార్డర్ ప్రాంతంలోని గోదాములో చెలరేగిన మంటల కారణంగా .. ఆ ప్రాంతమంతా దట్టంగా పొగ అల్లుకుంది. దీంతో స్థానికులకు ఊపిరి ఆడడం లేదు. ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు ఎవరైనా లోపల ఉన్నారా అనే విషయాలను ఆరా తీస్తున్నారు.
అసలు ప్రమాదం ఎలా జరిగిందో తెలియడం లేదని స్థానికులు చెబుతున్నారు. బహుశా షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. గతంలోనూ ఇలాంటి భారీ అగ్ని ప్రమాదాలు ఢిల్లీలో జరిగాయి. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పుడు కూడా 30 ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పాల్సి వస్తుందంటే.. ఇది కూడా పెద్ద ప్రమాదమే. పూర్తిగా మంటలు ఆర్పిన తర్వాత... ఎంత ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందనేది తెలిసే అవకాశం ఉంటుంది.