సరిహద్దు భద్రతా దళానికి చెందిన ఓ జవాన్ చేసిన చిన్న తప్పిదానికి అతని జీతంలో కోత పెట్టారు అధికారులు. అంతలా అతను ఏమి చేశాడనేగా? దేశ ప్రధాని నరేంద్ర మోదీ పేరుకు ముందు 'గౌరవనీయులైన/ శ్రీ' అని చేర్చలేదని, అది ప్రధానిని అగౌరవపరచడమే అని జవాన్ జీతంలో కోత పెట్టారు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్ నడియాలోని మహత్పూర్లోని బీఎస్ఎఫ్ 15వ బెటాలియన్ హెడాక్వార్టర్స్లో చోటుచేసుకుంది.
రోజువారీ జీరో పరేడ్‌లో భాగంగా చేసే కవాతులో ఒక నివేదిక ఇచ్చే క్రమంలో కానిస్టేబుల్ సంజీవ్ కుమార్ 'మోదీ ప్రొగ్రామ్' అని నివేదించాడు. ప్రధాని పేరుకు ముందు 'శ్రీ' లేదని గుర్తించిన బెటాలియన్ ఆఫీసర్ కానిస్టేబుల్ సంజీవ్‌పై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని నిర్ణయించాడు. బీఎస్ఎఫ్ చట్టంలోని సెక్షన్ 40 కింద సంజీవ్ నేరం చేసినట్లు పరిగణించి, అతని నెల జీతం నుంచి వారం రోజుల వేతనాన్నికట్ చేశారు. బీఎస్ఎఫ్ అధికారులు, సిబ్బంది ఈ క్రమశిక్షణ చర్యను ఖండించారు. దీనిపై బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ కు ఫిర్యాదు చేయగా, ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.