ఒకప్పుడు కోక కోలా వ్యవస్థాపకులు అమెరికాలో శికంజి (నిమ్మ రసం, జ్యూస్), మెక్ డొనాల్డ్ వ్యవస్థాపకులు దాబా హోటల్ నడుపుకునేవారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలోని టాల్కటోర స్టేడియంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జాతీయ ఓబీసీ సదస్సులో మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ట్విటర్ ద్వారా నెటిజెన్స్‌తో పంచుకుంది. ఈ సందర్భంగా సదస్సుకు హాజరైన ఓబీసీ శ్రేణులని ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఓవైపు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ మరోవైపు రైతులను, చిన్న పారిశ్రామికవేత్తలను విస్మరిస్తున్నారని ఆరోపించారు.
ప్రధాని నరేంద్ర మోదీ పాలన విధానం గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ ''దేశంలో ఓ 10-15 మంది ధనవంతులైన పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలకు మేలు చేస్తే, వాళ్లే ప్రధాని మోదీకి తిరిగి వేల కోట్ల రూపాయలు ఇస్తారని, అందుకే లబ్ధి అంతా ఆ 10-15 మందికే చెందుతుంది'' అని మోదీ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం ఇద్దరు ముగ్గురు బీజేపీ నేతలు, ఆర్ఎస్ఎస్ నేతల చేతుల్లో దేశం బానిసగా మారింది అని బీజేపీ, ఆర్ఎస్ఎస్‌పై రాహుల్ గాంధీ విమర్శనాస్త్రాలు సంధించారు.
బీజేపీ గురించి మాట్లాడేందుకు ఎవ్వరూ ధైర్యం చేయలేని దుస్థితి నెలకొంది. చివరకు ఎంపీలు కూడా భయంతో నోరు మెదపడం లేదు. బీజేపీ ఎవ్వరిని మాట్లాడేందుకు అనుమతించదు. ఒకవేళ మనలాంటి వాళ్లు ఎవరైనా మాట్లాడినా... ఆ పార్టీ వాళ్ల మాటలను చెవికి ఎక్కించుకోదు అంటూ బీజేపీపై, ప్రధాని మోదీ పాలనపై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
కోకకోలా, మెక్ డొనాల్డ్ వ్యవస్థాపకులపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు