వరంగల్: కోటి లింగాల వద్ద భద్రకాళి ఫైర్ వర్క్స్ గోదాములో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భారీ శబ్దాలతో బాణసంచా పేలింది. ఈ ప్రమాదంలో కనీసం పది మంది సజీవదహనమయ్యారు. పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. తొలుత ఇద్దరు సజీవదహనమైనట్లుగా వార్తలు వచ్చాయి.
ప్రమాదం జరిగిన సమయంలో గోదాంలో దాదాపు 15 మంది కార్మికులు పని చేస్తున్నట్లు చెబుతున్నారు. మంటల్లో మరి కొందరు చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు.
ఘటనాస్థలికి చేరుకున్న ఫైరింజన్ సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీగా ఆస్తినష్టం సంభవించినట్లు తెలుస్తుంది. కార్మికుల మృతితో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. క్షతగాత్రులను 108 వాహనాల్లో వరంగల్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటి వరకూ పది మృతదేహాలను వెలికి తీసినట్లు కలెక్టర్ తెలిపారు. క్షతగాత్రులలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమౌతున్నది. పరిస్థితిని జిల్లా యంత్రాంగం సమీక్షిస్తోంది.
వరంగల్ గోదాములో భారీ అగ్ని ప్రమాదం