డీఎంకే నేత కరుణానిధి ఆరోగ్యం విషమిస్తున్న క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, కలైంగర్ కుమారుడు స్టాలిన్‌కు, కుమార్తె కనిమొళికి ఫోన్ చేసి మాట్లాడారు. కరుణానిధి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సహాయ సహకారాలైనా కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. కరుణానిధి ఆరోగ్యం కొంచెం విషమించిందని ఆయనకు ట్రీట్ మెంట్ ఇస్తున్న కావేరి ఆసుపత్రి ప్రకటన విడుదల చేశాక.. ఆయన ఇంటికి స్వయానా డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం వెళ్లి మాట్లాడారు. అలాగే నటుడు కమల్ హాసన్, క్యాబినెట్ మంత్రి జయకుమార్ కూడా వెళ్లి పరామర్శించారు.
ప్రస్తుతం కరుణానిధి ఇంటిలోనే చికిత్స పొందుతున్నారు. అశోక్ గెహ్లాట్, అహ్మద్ పటేల్ వంటి జాతీయ నాయకులు కూడా కరుణానిధి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ రోజే కరుణానిధి డీఎంకేకి బాధ్యతలు చేపట్టి 50 సంవత్సరాలు కావడంతో.. ఆయనకు శుభాకాంక్షలు కూడా చెబుతూ పలువురు సోషల్ మీడియాలో సందేశాలు పోస్టు చేశారు.
94 ఏళ్ల కరుణానిధి మాటల రచయితగా తొలుత చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత రచయితగా కూడా ఆయన తమిళ సాహిత్య రంగంలో సత్తా చాటారు. ఆ తర్వాత రాజకీయ రంగంపై మక్కువతో 33 ఏళ్ల వయసులోనే కులితలై ప్రాంతం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అన్నాదురై వంటి నాయకుల ప్రేరణతో డీఎంకే పార్టీలో చేరిన కరుణానిధి, ఆయన మిత్రుడు నటుడు ఎంజీ రామచంద్రన్ అదే పార్టీలో పలు బాధ్యతలు స్వీకరించారు. అన్నాదురై మరణించిన తర్వాత.. అదే పార్టీ తరఫున కరుణానిధి 1969లో ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అయితే అభిప్రాయభేదాలు రావడంతో ఎంజీఆర్ డీఎంకే పార్టీ నుంచి విడిపోయి వేరేగా అన్నాడీఎంకే అనే పార్టీని స్థాపించారు.
Spoke to Thiru @mkstalin and Kanimozhi Ji. Enquired about the health of Kalaignar Karunanidhi Ji and offered any assistance required. I pray for his quick recovery and good health. @kalaignar89
— Narendra Modi (@narendramodi) July 27, 2018