ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌ని భారత్ కైవసం చేసుకొని మళ్లీ వన్డేల్లో నెంబర్ వన్‌గా నిలిచింది. నాగ్‌పూర్ వేదికగా ఆదివారం జరిగిన చివరి వన్డేలో 243 పరుగుల లక్ష్యాన్ని చేధించడంతో భారత్ తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకుంది. రోహిత్ శర్మ (125) సెంచరీ భారత్ విజయానికి వెన్నుదన్నుగా నిలవగా ఐదు వన్డేల సిరీస్‌ని 4-1 తేడాతో భారత్ చేజిక్కించుకొని విజయ దుందుభి మోగించింది. రోహిత్ శర్మతో పాటు అజింక్య రహానె (61), రథసారథి విరాట్ కోహ్లి (39) కూడా రాణించడంతో అనుకున్న లక్ష్యాన్ని టీమిండియా 42.5 ఓవర్లలోనే 244/3 స్కోరుతో పూర్తి చేసింది. ఈ విజయంతో భారత్ వన్డే ర్యాంకింగ్స్‌లో ప్రథమ స్థానంలో నిలవగా.. తర్వాతి స్థానాల్లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ నిలవడం గమనార్హం.
తొలుత టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా, డేవిడ్ వార్నర్ (53) అర్ధశతకం బాదినా.. మిడిలార్డర్ కుప్పకూలడంతో పరిస్థితి తారుమారైంది. దీంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 242 పరుగులు మాత్రమే చేయగలిగారు. మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు డేవిడ్ వార్నర్, అరోన్ ఫించ్ తొలి వికెట్‌కి 66 పరుగుల భాగస్వామ్యంతో జట్టుకి చెప్పుకోదగ్గ పరుగులనే అందించినా.. మిగతా ఆటగాళ్లు అనుకున్న అంచనాల మేరకు రాణించలేకపోయారు. 12వ ఓవర్‌లో బౌలర్ హార్దిక్ పాండ్య మంచి టెక్నిక్‌తో అరోన్ ఫించ్‌ని ఔట్ చేయగా.. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ స్టీవ్‌స్మిత్ (16)ని కేదార్ జాదవ్ పెవిలియన్ బాట పట్టించాడు.