Rishabh Pant and Yuzvendra Chahal to Play IND vs END T20WC Semi Final: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ 2022 పతాక సన్నివేశానికి చేరుకుంది. ఇప్పటికే న్యూజిలాండ్‌ను ఓడించిన పాకిస్థాన్ ఫైనల్ చేరగా.. నేడు ఇంగ్లండ్‌తో అమీతుమీకి భారత్ సిద్ధమైంది. అడిలైడ్‌లో రెండో సెమీ ఫైనల్ మధ్యాహ్నం 1.30కు ఆరంభం కానుంది. నేడు గెలిచిన జట్టు ఆదివారం జరిగే ఫైనల్లో పాకిస్థాన్‌తో తలపడనుంది. దాంతో ఫైనల్ బెర్త్ లక్ష్యంగా భారత్, ఇంగ్లండ్ బరిలోకి దిగుతున్నాయి. ఇరు జట్లు పటిష్టంగా ఉండడంతో రసవత్తర పోరు తప్పేలా లేదు.
సూపర్-12లో వరుస విజయాల అందుకుని కీలకమైన సెమీస్‌లో ఇంగ్లండ్‌ను ఓడించేందుకు భారత్ పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకుంది. విన్నింగ్ కాంబినేషన్‌ను కొనసాగిస్తూ.. పరిస్థితులకు అనుగుణంగా తుది జట్టులో మార్పులు ఉంటాయని ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ సూచనప్రాయంగా చెప్పారు. ఈ నేపథ్యంలో భారత తుది జట్టు ఎంపికపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. కెప్టెన్, కోచ్ మాటలను బట్టి చూస్తే.. తుది జట్టులో రోహిత్ రెండు మార్పులు చేసే అవకాశం ఉంది.
ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్ మ్యాచులో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ స్థానంలో మణికట్టు స్పిన్నర్ యుజువేంద్ర చహల్ ఆడే అవకాశాలున్నాయి. సెమీస్ జరిగే అడిలైడ్ పిచ్ స్లో బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. దీంతో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అక్షర్ స్థానంలో మణికట్టు మాంత్రికుడు చహల్‌ను ఆడించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మెగా టోర్నీలో అక్షర్ అంతగా ప్రభావం చూపని విషయం తెలిసిందే. బౌలింగ్‌లో సోసో అనిపించినా.. బ్యాటింగ్‌లో మాత్రం తేలిపోయాడు.
ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్ మ్యాచులో వికెట్ కీపర్ ఎవరు ఆడుతారనే దానిపై ఇప్పటికీ సర్వత్రా ఆసక్తి నెలకొంది. దినేశ్ కార్తిక్, రిషబ్ పంత్‌లలో ఎవరిని తీసుకుంటారనే దానిపై ఇంకా స్పష్టత లేదు. పొట్టి టోర్నీలో డీకే అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాడు. దాంతో జింబాబ్వేతో మ్యాచ్‌లో పంత్‌కు అవకాశం ఇవ్వగా.. అతడు ఆశించినంత మేర రాణించలేదు. దీంతో ఈ ఇద్దరిలో ఎవరిని తీసుకోవాలనే దానిపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది. అయితే ఇంగ్లండ్‌పై పంత్ ఆడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని సమాచారం తెలుస్తోంది. సెమీ ఫైనల్లో డీకే ఆడకుంటే దాదాపుగా అతడి కెరీర్ క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
తుది జట్టు అంచనా:
కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, యుజువేంద్ర చహల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మొహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్.