న్యూ ఢిల్లీ: మిజోరామ్ వాలీబాల్ క్రీడాకారిణి లాల్వెంట్ లువాంగి ఒక్కసారిగా సోషల్ మీడియాలో సంచలనంగా మారిపోయారు. ఇంతకీ ఆమె ఏం చేశారంటే.. క్రీడలపై తనకున్న మక్కువను ప్రదర్శిస్తూనే.. తనలోని మాతృత్వాన్ని చాటుకున్నారు. మిజోరామ్ రాజధాని ఐజ్వాల్‌లో ప్రస్తుతం రాష్ట్ర క్రీడలు జరుగుతున్నాయి. టియుకుమ్ అనే మారుమూల జిల్లా నుంచి వచ్చిన లాల్వెంట్ లువాంగి ఈ టోర్నమెంట్‌లో భాగంగా వాలీబాల్ మ్యాచ్‌లో పాల్గొన్నారు. ఆమె తన ఏడు నెలల బిడ్డతో కలిసి మ్యాచ్ ఆడేందుకు వచ్చారు. మ్యాచ్‌లో కాస్త బ్రేక్ తీసుకుని బిడ్డకు పాలు పట్టారు. ఆ సందర్భంగా చుట్టూ ఉన్న పరిస్థితులను ఆమె ఏ మాత్రం పట్టించుకోలేదు. బిడ్డ ఆకలిని తీర్చడం మాత్రమే తనకు ముఖ్యం అన్నట్లుగా వ్యవహరించి తనలోని మాతృత్వాన్ని చాటుకున్నారు. ఆమె బిడ్డకు పాలిస్తున్న ఫోటో ఇంటర్నెట్‌లో ఓ సంచలనంగా మారింది.
మిజోరామ్ క్రీడా శాఖ మంత్రి రాబర్ట్ రోమావ్యా రాయిటే ట్విట్టర్‌లో ఈ ఫోటోను పోస్ట్ చేశారు. దీంతో ఈ ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. మ్యాచ్ మధ్యలో బ్రేక్ టైమ్ తీసుకుని తన తల్లి మనసు చాటుకున్న లాల్వెంట్ లువాంగిని నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఓవైపు క్రీడాకారిణిగా రాణిస్తూనే మరోవైపు తల్లిగా రెండు పాత్రలను అంకితభావంతో పోషించారని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు మిజోరామ్ క్రీడాశాఖ మంత్రి మరో అడుగు ముందుకేసి ఆమెకు నజరానాగా 10 వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు.