ఆసియా కప్ 2018: పాకిస్తాన్‌కు చుక్కలు చూపించిన టీమిండియా బౌలర్లు

పాకిస్తాన్‌ను స్వల్పమైన స్కోర్‌కే ఆలౌట్ చేసిన టీమిండియా బౌలర్లు

Last Updated : Sep 20, 2018, 12:36 PM IST
ఆసియా కప్ 2018: పాకిస్తాన్‌కు చుక్కలు చూపించిన టీమిండియా బౌలర్లు

ఆసియా కప్ 2018లో పాకిస్తాన్‌తో ఆడిన మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు భువనేశ్వర్ కుమార్, కేదార్ జాదవ్, జస్ప్రిత్ బుమ్రా అద్భుతమైన ప్రతిభ కనబర్చి పాక్ బ్యాట్స్‌మెన్లను ముప్పుతిప్పలు పెట్టారు. పాక్ ఆటగాళ్లను స్వల్పమైన వ్యక్తిగత స్కోర్‌కే ఒక్కొక్కరిని పెవిలియన్ బాటపట్టిస్తూ పాక్ జట్టుని పాక్ జట్టుని 162 పరుగుల అత్యల్పమైన స్కోర్‌కే పరిమితం చేశారు. మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్‌కు భువనేశ్వర్ కూమార్ రూపంలో ఆరంభంలోనే అద్దిరిపోయే దెబ్బ తగిలింది. భువనేశ్వర్ బౌలింగ్‌లోనే పాక్ ఓపెనర్స్ ఇమామ్ ఉల్ హఖ్(2), ఫకార్ జమన్ (0) పెవిలియన్ బాట పట్టారు. ఆ తర్వాత పాకిస్థాన్‌ను షోయబ్ మలిక్, బాబర్ ఆజామ్‌లు ఆదుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలోనే కుల్దీప్ యాదవ్ రూపంలో పాక్‌కి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. కుల్దీప్ యాదవ్ వేసిన 22వ ఓవర్ తొలి బంతికి బాబర్(47) క్లీన్ బౌల్డ్ కాగా అనంతరం బ్యాటింగ్‌కి వచ్చిన పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్(6) భారీ షాట్‌కు ప్రయత్నించి మనీశ్ పాండేకి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. తడబాటులో తీసుకున్న నిర్ణయం కారణంగా షోయబ్ మలిక్(43) రనౌట్ కాగా తర్వాత క్రీజులోకి వచ్చిన అసిఫ్ అలీ(9) కేదార్ జాదవ్ బౌలింగ్‌లో ధోనీ చేతికి చిక్కాడు. ఇలా వచ్చిన వాళ్లు వచ్చినట్టే తక్కువ స్కోర్‌కే పెవిలియన్ బాట పట్టడంతో పాకిస్థాన్ 43.1 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌట్ అయింది. 

టీమిండియా బౌలర్లలో హార్ధిక్ పాండ్య గాయం కారణంగా ఆట నుంచి నిష్క్రమించడంతో టీమిండియాకు బౌలర్ల రూపంలో ఓ ఎదురు దెబ్బ తగిలిందని భావించినప్పటికీ.. భువనేశ్వర్ కుమార్, కేదార్ జాదవ్ చెరో మూడు వికెట్లు తీసుకోగా, జస్ప్రిత్ బుమ్రా రెండు, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టి టీమిండియా సత్తాచాటారు.  

Trending News