Hyderabad Metro Second Phase: హైదరాబాద్‌లో మరో భారీ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మెట్రో రెండో దశకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు నిర్మించే ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రోకు మైండ్ స్పేస్ వద్ద ఆయన పునాదిరాయి వేశారు.
అంతర్జాతీయ నగరాలతో పోటీపడుతున్న హైదరాబాద్‌లో విమానాశ్రయం వరకు మెట్రో ఉండాలనేది ప్రభుత్వం ఆలోచన. ఈ మేరకు రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 30.7 కిలోమీటర్ల మెట్రో నిర్మాణానికి డీపీఆర్ రెడీ అయింది. 2019లోనే ఈ డీపీఆర్ రెడీ అయినా నిధుల లేమితో ఇన్నాళ్లు ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఎట్టకేలకు సీఎం పచ్చజెండా ఊపడంతో ఇప్పుడు పునాదిరాయి పడింది.
మెట్రో శంకుస్థాపన అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను పవర్ ఐలాండ్‌గా మార్చామన్నారు. దేశంలో హైదరాబాద్ నగరానికి ప్రత్యేక స్థానముందని చెప్పారు. న్యూయార్క్, లండన్, పారిస్‌లో అయినా కరెంట్ పోతుందేమో కానీ.. ప్రస్తుతం హైదరాబాద్‌లో కరెంట్ పోయే పరిస్థితి లేదన్నారు. సమైక్య పాలనలో హైదరాబాద్ నగరం నిర్లక్ష్యానికి గురైందన్న కేసీఆర్.. ఇప్పుడు అన్ని సమస్యలను అధిగమించి అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం దినదినాభివృద్ధి చెందుతూ విశ్వనగరంగా దూసుకెళ్తోందన్నారు.
రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం మెట్రో విస్తరణ పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం అప్పా జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. మెట్రో ఏర్పాటులో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయన్నారు కేసీఆర్. ఈ సందర్భంగా ఆయన మరో కీలక ప్రకటన చేశారు.
'బీహెచ్ఈఎల్ నుంచి రాయదుర్గం వరకు మెట్రో విస్తరించాల్సి ఉంది. హైదరాబాద్ నగరం చుట్టూ కూడా మెట్రో రైలు రావాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఆ సౌకర్యాలను కూడా కలిగించుకుంటాం. ప్రస్తుతం హైదరాబాద్ నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు ఎలా ఉందో.. అచ్చం అలానే మన నగరం చుట్టూ మెట్రో రైలు రావాల్సిన ఉంది..' అని సీఎం కేసీఆర్ అన్నారు. ట్రాఫిక్ రద్దీని నియంత్రించే ఏకైక మార్గం మెట్రో రైల్ అని ఆయన చెప్పారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో మెట్రో ఆకాశమార్గంలో ఉంది. సెకెండ్ ఫేజ్ నిర్మాణంలో అండర్ గ్రౌండ్‌లో మెట్రో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌పోర్టు సమీపంలో భూగర్భ మార్గాన్ని నిర్మించేలా ఇప్పటికే ప్లాన్ సిద్ధం చేశారు. సెకెండ్ ఫేజ్‌లో మొత్తం 31 కి.మీ. మెట్రో మార్గం సిద్ధమవుతుండగా.. ఇందులో 27.5 కి.మీ.ఆకాశమార్గంలో.. ఒక కిలో మీటర్ రోడ్డు మార్గం.. మరో 2.5 కి.మీ. మాత్రం అండర్ గ్రౌండ్‌లో నిర్మించనున్నారు. ఈ మెట్రో నిర్మాణం పూర్తయితే.. శంషాబాద్ ఎయిర్ పోర్టు ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.
Also Read: Budget 2023: పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులకు శుభవార్త.. త్వరలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన..?
Also Read: Pawan Kalyan: వారాహి కలర్ వివాదంపై పవన్ కళ్యాణ్ పంచ్.. జనసేనానిని ఇంట్రెస్టింగ్ ట్వీట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook