ఏపీకు ప్రత్యేక హోదా ఇస్తే.. తెలంగాణకూ ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఇటీవలే తెలిపిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై హరీష్ రావు మండిప్డడారు. అబద్ధాలు ఆడడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుందని ఆయన అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడమే పనిగా పెట్టుకున్నారని హరీష్ రావు అభిప్రాయపడ్డారు. అలాగే రాహుల్ గాంధీకి కూడా పలు ప్రశ్నలు సంధించారు. ‘‘రాహుల్జీ.. మీరు తెలంగాణ వచ్చి అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పిస్తానన్నారు... మంచి పనే. అయితే.. మా మనసులో ఎంతో బాధ దాగి ఉంది. ఎవరు అమరవీరులు? వారి అమరత్వానికి కారకులెవరు? వారి స్థూపం దేనికి సాక్ష్యం? దేనికి సాక్ష్యంగా ఆ స్థూపాన్ని నిర్మించారు?’’ అని హరీష్ రావు, రాహుల్ గాంధీని ప్రశ్నించారు.
1969లో ఇందిరాగాంధీ ప్రభుత్వం 369 మందిని కాల్చి చంపిందని.. అప్పుడు ఎక్కా యాదగిరి గారు ఆ అమరవీరులు స్మారకార్థం ఆ స్థూపం కట్టారన్నారు. "కాల్చేది మీరే.. నివాళులు అర్పించేది మీరే.. తెలంగాణ ప్రజలు ఈ విషయాన్ని మర్చిపోయారని అనుకుంటున్నారా" అని హరీష్ రావు, రాహుల్ గాంధీని ప్రశ్నించారు.
9 డిసెంబరు 2009 తేదిన తెలంగాణ ప్రకటించి, డిసెంబరు 23 తేదిన తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీదని.. వారు అలా చేయడం వల్లే తెలంగాణలో అనేకమంది ఆత్మహత్యలు చేసుకున్నారని రాహుల్ తెలిపారు. వారి ఆత్మహత్యలకు కారణం కాంగ్రెస్ పార్టీ కాదా..? అని హరీష్ రావు ప్రశ్నించారు. సీడబ్ల్యూసీలో తెలంగాణ నుంచి ఒక్కరికి కూడా కాంగ్రెస్ ఎందుకు ప్రాతినిధ్యం కల్పించలేదని అన్నారు. తెలంగాణపై కాంగ్రెస్ ఎప్పటిలాగే తక్కువభావనతో ఉందని హరీష్ రావు అభిప్రాయపడ్డారు.