ప్రేమ, పెళ్లి పేరుతో బాగా డబ్బున్న కుర్రాళ్లు, ప్రముఖులకి వల వేస్తూ వారిని నిలువు దోపిడీ చేస్తోన్న ఓ కిలాడీ బాగోతం ఇది. చెన్నై నుంచి వరంగల్‌కి వచ్చిన ప్రియదర్శిని అలియాస్ స్నేహ అనే యువతి తనని తాను ఓ డాక్టర్‌గా పరిచయం చేసుకుని మోసాలకి తెరతీసింది. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఆంకాలజిస్ట్‌గా పరిచయం చేసుకుని అక్కడి మహీంద్రా అండ్ మహీంద్రా షోరూంలో రూ. 75 లక్షల విలువ చేసే నాలుగు కార్లు కొన్న ఈ కిలాడీ లేడీ ఆ మొత్తానికిగాను వారికి చెక్కులిచ్చింది. ఆ చెక్కులు బౌన్స్ అయ్యాకే కానీ వారికి తెలియలేదు ఆ కిలాడీ తమని మోసం చేసిందని. అలాగే వరంగల్‌కి చెందిన ఓ ప్రముఖుడి కుమారుడికి ప్రేమ పేరుతో వల వేసిన ప్రియదర్శిని.. కేవలం ఐదు రోజుల్లోనే అతడిని పెళ్లి చేసుకుని అతడిని రూ.5లక్షలు, అతడి స్నేహితులని నుంచి మరో రూ.10 లక్షల మేర మోసం చేసి అక్కడి నుంచి ఉడాయించింది.
చెన్నై నుంచి వరంగల్ వచ్చిన ప్రియదర్శిని తన నేరాలని కేవలం వరంగల్ కి మాత్రమే పరిమితం చేయకుండా హైదరాబాద్ లోనూ రూ.1 లక్షల చెల్లింపుల విషయంలో చెల్లని చెక్కులు ఇచ్చి రాంనగర్ లోని హ్యూందాయ్ కార్ల షోరూం నిర్వాహకులని మోసం చేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. బాధితుల నుంచి సేకరించిన ఫోటోలని సైతం విడుదల చేసిన పోలీసులు.. తమ వద్ద వున్న ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రస్తుతం నిందితురాలు బెంగుళూరులో తలదాచుకున్నట్టు అనుమానం వ్యక్తంచేశారు.