Basara IIIT: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఇటీవలే సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు రోడ్డెక్కడం రాజకీయ రచ్చగా మారింది. వారం రోజుల పాటు పట్టు వీడకుండా పోరాటం చేశారు విద్యార్థులు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్యాంపస్ కు వెళ్లి విద్యార్థులతో చర్చించి ఆందోళన విరమింప చేశారు. విద్యార్థుల డిమాండ్ మేరకు ఐదు కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంత జరిగినా బాసర ట్రిపుల్ ఐటీ నిర్వహణలో నిర్లక్ష్యం మాత్రం మారలేదు. క్యాంపస్ లో భోజనం వికటించి వందలాది మంది విద్యార్థులు అనారోగ్యానికి గురికావడం కలకలం రేపుతోంది. వందలాది మంది విద్యార్థులు వాంతులు, విరోచనాలతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో నిజామాబాద్ హాస్పిటల్స్ కు తరలించారు. కొందరికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
బాసర ట్రిపుల్ ఐటీ ఫుడ్ పాయిజన్ ఘటన మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. విపక్షాలు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ ట్వీట్టర్ లో ఈ ఘటనపై స్పందించారు. విద్యాశాఖ మంత్రి విద్యార్థుల సంక్షేమమే కాకుండా ఇతర అంశాలపై కూడా ప్రాధాన్యత చూపిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలను పట్టించుకోని కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. జేబులు నింపుకోవడంపైనే టీఆర్ఎస్ నేతలకు శ్రద్ధ ఉందన్నారు మాణిక్యం ఠాగూర్. తెలంగాణలో కొడుకు, అల్లుడు రాజ్యం అంతమవ్వాలని అన్నారు.
Priority for TRS Education minister continues to be other than Students welfare. TRS government days are numbered as they don’t care about Telangana. They only care about Income and filling their pockets… Koduku Alludu Raj must End . https://t.co/soUHfyibgR
— Manickam Tagore .B🇮🇳✋மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) July 16, 2022
కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులను నిజామాబాద్ హాస్పిటల్ లో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పరామర్శించారు. విద్యార్థుల తల్లితండ్రులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ సర్కార్ పై తీవ్ర ఆరోపణలు చేశారు నారాయణ. సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు ఆందోళన చేసినా పరిస్థితులు మారలేదన్నారు. క్యాంపస్ లో మెస్ మారలేదని, కాంట్రాక్టర్లను మార్చలేదని.. విద్యార్థులకు ఇస్తున్న ఆహారం నాణ్యత నాసిరకంగానే ఉందన్నారు. మెస్‌ను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వకుండా యాజమాన్యమే నిర్వహిస్తే సమస్యే రాదన్నారు. ఫుడ్ పాయిజన్ ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు.
ఫుడ్ పాయిజన్ బాధిత విద్యార్థులను నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్ సర్కార్ పై సంచలన ఆరోపణలు చేశారు. గత ఎనిమిది ఏళ్లలో యూనివర్సిటీలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని ఆరోపించారు. యూనివర్శిటీల్లో మెస్ కాంట్రాక్టులన్నీ అధికార పార్టీ నేతలకు సంబంధించిన సంస్థలవేనని చెప్పారు. బాసర ట్రిపుల్ ఐటీ మెస్ నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విపక్షాలు ముఖ్యమంత్రితో ములఖత్ అయ్యాయని ఆరోపించారు. ప్రతిపక్షాలు సరిగా ఉంటే ఈ పరిస్థితి ఉండది కాదన్నారు. విద్యార్థుల డిమాండ్లను ఎగతాళి చేసిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
నాసిరకం ఆహారం తిని తీవ్ర అస్వస్థతకు గురైన బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ప్రస్తుతం కోలుకుంటున్నారు.ఫుడ్ పాయిజన్‌తో 100 మందికిపైగా విద్యార్థులు వాంతులు, విరేచనాలతో పడిపోయారు. బాసర్ క్యాంపస్ ఆసుపత్రిలో 60 మందికి చికిత్స అందించారు. పరిస్థితి తీవ్రంగా ఉన్న వారిలో నిజామాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో 17 మందికి, నవీపేటలో 12 మందికి చికిత్స అందించారు. సీరియస్ గా ఉన్న ఇద్దరికి ఐసీయూలో ఇంకా ట్రీట్ మెంట్ కొనసాగుతోంది. మరోవైపు ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ ఘటనపై ప్రభుత్వంపై సీరియస్ గా స్పందించింది. సమగ్ర విచారణకు ఆదేశించారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. బాధిత విద్యార్థులను ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ వెంకటరమణ పరామర్శించారు. క్యాంపస్ మెస్ కాంట్రాక్టు సంస్థపై కేసులు నమోదు చేశారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యయి.
Read Also: Adah Sharma: ఆకులే అడ్డంగా ఆదా శర్మ రచ్చ.. డ్రెస్ ఇలా కూడా ఉంటుందా?
Read Also: Krithi Shetty: చీరకట్టులో కవ్విస్తున్న బేబమ్మ.. చిన్నపిల్లను కాదంటోందే!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్ స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook