హైదరాబాద్: తనను మూడుసార్లు గెలిపించిన నియోజకవర్గ ప్రజల అవసరాలు, నియోజకవర్గం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తాను టీడీపీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే, టీడీపీ నేత సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. త్వరలోనే టీడీపీకి రాజీనామా చేయనున్నట్లు సండ్ర వెంకట వీరయ్య తేల్చిచెప్పారు. ఖమ్మం జిల్లాలోని పలు నియోజకవర్గాలకు సాగు నీరు విడుదల చేయాల్సిందిగా కోరుతూ సండ్ర వెంకట వీరయ్య శనివారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన సంగతి తెలిసిందే. సండ్ర వెంకట వీరయ్య ముఖ్యమంత్రితో భేటీ అవడంతో ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం ఊపందుకుంది. తాను పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారంపై సండ్ర వెంకట వీరయ్య ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఆ ప్రచారం నిజమేనని అంగీకరించారు.
ఓటుకు నోటు కేసులో సండ్ర వెంకట వీరయ్య పేరు కూడా ఉన్న నేపథ్యంలో కేసులకు భయపడే ఆయన పార్టీ మారుతున్నారా అని వినిపిస్తున్న సందేహాలను సండ్ర కొట్టిపారేశారు. కేసులకు భయపడేవాడినే అయితే, అప్పుడే పార్టీ మారేవాడిని కానీ ఇంతకాలం ఆగేవాడిని కాదు అని చెబుతూ.. అయినా ఆ కేసులు ఇప్పుడు కోర్టు పరిధిలో ఉన్నాయని, ప్రభుత్వం చేతుల్లో ఏం లేదని బదులిచ్చారు. నియోజకవర్గంలో కార్యకర్తలతో చర్చించిన అనంతరం తాను ఎప్పుడూ పార్టీ మారాలనుకుంటున్నానే వివరాలను వెల్లడిస్తానని స్పష్టంచేశారు.