హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి విలయతాండవం ప్రదర్శిస్తోంది. ప్రతి రోజూ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. పెరుగుతున్న కేసులతో జనాల్లోనూ ఆందోళన మొదలయింది. అంతేకాదు త్వరలోనే హైదరాబాద్‌లో సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తారనే ప్రభుత్వ సంకేతాలతో చాలా మంది మళ్లీ గ్రామాల బాట పట్టారు. హైదరాబాద్ నుంచి గ్రామాలకు వెళ్తున్న వారి సంఖ్య మళ్లీ పెరుగుతోంది. లాక్‌డౌన్ ప్రకటిస్తే ఇక్కడే చిక్కుకుపోతామని భావించి ముందే అప్రమత్తమై బస్సులు, సొంత వాహనాల్లో సొంతూళ్లకు పయనమవుతున్నారు.
Also Read: డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ కు వారెంట్ జారీ..
అంతేకాదు హైదరాబాద్ పరిధిలో పెరుగుతున్న నేపథ్యంలో కరోనా సోకుతుందేమోనని భయపడిపోతున్నారు. అందుకే సొంతూళ్లకు పయనమవుతున్నారు. మరోవైపు గ్రామీణ ప్రజలు కూడా అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ నుంచి వస్తున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో గ్రామాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా గ్రామాలు మళ్లీ దిగ్బంధనంలోకి వెళ్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వచ్చే వారిపై గ్రామ పంచాయతీలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి ఎవరైనా వస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నాయి.
Also Read: Tik Tok, UC Browser: టిక్ టాక్, యూసీ బ్రౌజర్ సహా 59 మొబైల్ యాప్స్‌పై కేంద్రం నిషేధం
ఇదిలాఉండగా కొన్ని గ్రామాల్లో 14 రోజులు హోంక్వారంటైన్‌లో ఉండాలని నిబంధనలు పెడుతున్నారు. మరోవైపు హైదరాబాద్‌లో లాక్‌డౌన్ విధిస్తారనే వార్తల నేపథ్యంలో నగరవాసులు అప్రమత్తమయ్యారు. ఈసారి కఠినంగా లాక్‌డౌన్ అమలు చేస్తారని, నిత్యావసర సరుకులకు కూడా కేవలం 2 గంటలే అనుమతిస్తారని ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో నగరవాసులు సూపర్ మార్కెట్లకు వెళ్లి సరుకులు తెచ్చుకుంటున్నారు. అటు వైన్ షాపులు సైతం కిటకిటలాడుతున్నాయి. లాక్‌డౌన్ విధిస్తే మద్యం దొరకదనే ముందుచూపుతో మందు ప్రియులు మద్యం షాపుల వద్ద పడిగాపులు కాస్తున్నారు.
Also Read: Sushant Singh Rajput: సుశాంత్ ఆత్మహత్య కేసులో మరో సంచలన ట్విస్ట్..