TSRTC fares hike issue: హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల పెంచాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల (Parliament sessions) కోసం ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఆర్టీసీ టికెట్ల చార్జీల పెరుగుదల అంశంపై అక్కడి నుంచే స్పందించారు.
ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (MP Komatireddy Venkat Reddy).. ఇప్పటికే డీజిల్, పెట్రోల్ ధరల పెరగటం వల్ల నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయి. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలపై ఆర్థికంగా భారీ భారం పడుతోంది. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రజలని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకపోగా.. ఆర్టీసి ఛార్జీలు పెంచి ప్రజలకు రవాణా భారాన్ని కూడా పెంచాలని చూస్తోంది అని మండిపడ్డారు.
తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఆర్టీసీ టికెట్ల చార్జీల పెంపు నిర్ణయం మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా ఉంది అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఇకనైనా టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచించి టిఎస్ఆర్టీసీ టికెట్ల చార్జీల పెంపు (TSRTC charges hiked) నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.