మా పనులకు చంద్రబాబు అడ్డుతగిలితే ఊరుకోం: హరీష్ రావు

తెలంగాణ మంత్రి హరీష్ రావు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడి పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

Last Updated : Jun 23, 2018, 11:15 AM IST
మా పనులకు చంద్రబాబు అడ్డుతగిలితే ఊరుకోం: హరీష్ రావు

తెలంగాణ మంత్రి హరీష్ రావు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడి పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము ప్రతిష్టాత్మకంగా భావిస్తూ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులను చంద్రబాబు ఆపితే చూస్తూ ఊరుకోమని ఆయన అన్నారు. గతంలో చంద్రబాబు ఇదే పని మీద ఢిల్లీ వెళ్లి ప్రాజెక్టు విషయంలో రాజకీయాలు చేయాలని ప్రయత్నించారని హరీష్ రావు ఆరోపించారు.

శుక్రవారం జగిత్యాల ప్రాంతంలో పర్యటించిన హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలంలోని కన్నేపల్లి గ్రామం వద్ద గోదావరి నదిపై నిర్మిస్తున్నారు. దీని ఆయకట్టు 45,000 ఎకరాలు. సుమారు 235 టీఎంసీల నీటిని ఎత్తిపోయడమే దీని లక్ష్యం అని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు అని హరీష్ రావు అన్నారు.

తన పర్యటనలో భాగంగా హరీష్ రావు కాంగ్రెస్ పై కూడా ధ్వజమెత్తారు. ఎల్లంపల్లి ప్రారంభించిన కాంగ్రెస్ అక్కడ కనీసం ఒక నీటి బొట్టు కూడా నింపలేదని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టుల కోసం తెలంగాణకు 954 టీఎంసీలు వాడుకునే హక్కు ఉందని హరీష్ రావు అన్నారు. శ్రీకృష్ణ కమిటీ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసిందని, ఈ వాటా  కోసమే కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులు తెలంగాణ ప్రభుత్వం కట్టడానికి సిద్ధమైందని మంత్రి తెలిపారు.

Trending News