కాలుష్యం తగ్గించాలంటే దేశంలో ఉన్న ప్రజలందరికీ ఉచిత ప్రయాణం కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే ఆ మేరకు ఆలోచన చేసి ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసుకుంది. ఇక అమలు చేయడమే తరువాయి. ఇది గనక అమలైతే సొంత వాహనాలు రోడ్ల మీద తిరగడం తగ్గిపోతాయి. దీంతో కాలుష్యం కూడా తగ్గుముఖం పడుతుంది. అయితే ఇది అమలయ్యేది భారతదేశంలో కాదండి ..! జర్మనీలో..
జర్మనీలో 20కు పైగా ప్రధాన పట్టణాల్లో నత్రజని స్థాయి పెరిగింది. దీంతో అక్కడి ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. 2020 వరకు కాలుష్యాన్ని నిరోధించలేమనే ఆలోచనకు అక్కడి ప్రభుత్వం వచ్చినట్లు సమాచారం. ఈ సమయంలో అక్కడి ప్రభుత్వానికి ఓ విన్నూత ఆలోచన వచ్చింది. ప్రజలందరికీ ప్రభుత్వ రవాణా వ్యవస్థలో ఉచిత ప్రయాణం కల్పిస్తే.. వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గిపోతుందని.. తద్వారా కాలుష్యానికి అడ్డుకట్ట వేయవచ్చని అలోచించి ప్రతిపాదనలు సిద్ధం చేసుకుంటోంది.
ఉచిత రవాణా సౌకర్యానికి అయ్యే వ్యయాలపై ఇప్పటికైతే స్పష్టత లేదు. అవసరమైతే మున్సిపాలిటీలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక భారాన్ని పంచుకుంటాయని అక్కడి ప్రభుత్వం ప్రకటన స్పష్టం చేసింది. నైట్రోజన్ ఆక్సైడ్ స్థాయిలు పెరిగిపోయిన పట్టణాల్లో డీజిల్ వాహనాలను నిషేధించే ఆలోచన కూడా చేస్తోంది.