హిందూపురంలో బాలకృష్ణకు అవమానం ?

హిందూపురంలో బాలకృష్ణకు అవమానం ?

Last Updated : Oct 26, 2019, 06:03 PM IST
హిందూపురంలో బాలకృష్ణకు అవమానం ?

హిందూపురం: ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సొంత నియోజకవర్గంలోనే అవమానం జరిగిందని టీడీపీ శ్రేణులు నిరసనకు దిగాయి. శుక్రవారం ఉదయం నియోజకవర్గంలోని అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడానికి వచ్చిన బాలకృష్ణ అంతకన్నా ముందుగానే తాను హిందూపురం వస్తున్నానని.. భద్రత కల్పించాలనీ కోరుతూ స్థానిక పోలీసులకు సమాచారం అందించినట్టు తెలుస్తోంది. అయితే, బాలకృష్ట నియోజకవర్గంలోకి ప్రవేశించడమే కాకుండా తన నివాసానికి చేరుకుని, అక్కడే సమీక్షా సమావేశం నిర్వహించినప్పటికీ పోలీసులు రాలేదని సమాచారం. అప్పటికే పోలీసుల వైఖరిపై తీవ్ర అసహనానికి గురైన బాలకృష్ట... మధ్యాహ్నం 2 గంటల వేళ అక్కడి నుంచి తాను బెంగుళూరు వెళ్తున్నానని... ఎస్కార్ట్ వాహనాలతో భద్రత కల్పించాల్సిందిగా కోరుతూ మరోసారి మూడు పోలీసు స్టేషన్లకి సమాచారం అందించారని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. అయినప్పటికీ పోలీసులు ఎవ్వరూ అక్కడికి రాలేదని, దీంతో వారి రాక కోసం అర్ధగంటపాటు వేచిచూసిన బాలయ్య బాబు.. ఇక చేసేదేం లేక తన కారులో తాను బెంగుళూరు వైపు వెళ్లిపోయారని స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తంచేశారు. మార్గం మధ్యలో తమ ఎమ్మెల్యేకు ఏదైనా ఇబ్బంది ఎదురైతే... అందుకు పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని టీడీపీ నేతలు, బాలయ్య బాబు అభిమానులు డిమాండ్ చేశారు. 

టీడీపీ హయాంలో ఎమ్మెల్యే వస్తే, డిఎస్పీ, ఇద్దరు సీఐలు, ముగ్గురు ఎస్సైలు బందోబస్తు కల్పించేవారని.. అదే ప్రోటోకాల్‌ను ఇప్పుడు ఎందుకు పాటించడం లేదని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. హిందూపురం పోలీసులు ప్రోటోకాల్ పాటించకుండా తన నాయకుడిని అవమానించారని టీడీపీ నేతలు నిరసన వ్యక్తంచేశారు. ఎమ్మెల్యే ఏ పార్టీకి చెందిన వారైన.. వారికి ప్రోటోకాల్ ప్రకారం భద్రత కల్పించాలని స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు డిమాండ్ చేశారు.

Trending News