Pawan Kalyan Questions to AP CM YS Jagan: తనపై ఏపీ సీఎం వైఎస్ జగన్ చేస్తోన్న వ్యక్తిగత ఆరోపణలకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెంలో బుధవారం జరిగిన వారాహి యాత్ర వేదికపై నుంచి సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా ఏపీ సీఎం జగన్ కి అనేక ప్రశ్నలు సంధించారు. ఈసారి కూడా తన ప్రశ్నలకు వ్యక్తిగత కోణంలో చూడకుండా నేరుగా సమాధానం ఇవ్వాలి అని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏం అడిగారంటే..
ప్రశ్న 1
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 6 కోట్ల మంది ప్రజల సమాచారం ఎందుకు పక్క రాష్ట్రం హైదరాబాద్‌లోని నానక్ రాంగూడ ప్రాంతంలో ఉన్న ‘‘ఎఫ్ఓఏ’’ అనే ఏజెన్సీ వద్ద ఉంది ? ప్రజల డేటాను సేకరించి అక్కడకు ఎందుకు పంపిస్తున్నారు ? సమాధానం చెప్పాలి జగన్ ?
ప్రశ్న 2
ఆ ఏజెన్సీలో పనిచేస్తున్న 700 మంది సిబ్బంది ప్రజల డేటాతో ఏం చేస్తున్నారు ? అసలు వారికి జీతాలు ఇస్తుంది ఎవరు ? దాని నిర్వహణ బాధ్యతలు ఎవరు చూస్తున్నారు ? అసలు అక్కడకు ప్రజల డేటాను పంపి మీరు ఏం చేయదల్చుకున్నారు ? జగన్ వింటున్నావా.. సమాధానం చెప్పు ?
ప్రశ్న 3
1859లో మొదలుపెట్టి, ప్రపంచమంతా విస్తరించిన సామాజిక సేవా సంస్థ రెడ్ క్రాస్ లాంటి వాలంటీరు సంస్థకే భారతదేశ చాప్టర్‌కు భారత రాష్ట్రపతి, రాష్ట్రాలకు గవర్నర్లు బాధ్యత తీసుకుంటారు. మరి నీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజాధనం ఖర్చు చేసి మరీ పని చేయిస్తున్న వాలంటీర్లపై ఎవరు బాధ్యత తీసుకుంటారు ? అసలు ఈ వ్యవస్థకు అధిపతి ఎవరు ? కొందరు వాలంటీర్లు చేస్తున్న అసాంఘిక పనులు, నేరాలకు నువ్వు బాధ్యత తీసుకుంటావా లేదా ? ప్రజలకు వివరించు జగన్ ?
ప్రశ్న 4
రాజకీయ కారణాలతో 26 మంది ఆడపడుచులకి దక్కాల్సిన సంక్షేమ పథకాలను వాలంటీర్లు... తొలగిస్తే వారు న్యాయం చేయాలని గౌరవ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి జస్టిస్ బట్టు దేవానంద్ వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. వాళ్లకు వ్యక్తిగత సమాచారం తీసుకునే లీగల్ అథారిటీ ఎక్కడిది ? ఎవరిచ్చారు ? ఇంతమంది ప్రభుత్వ అధికారులు ఉండగా వీళ్లే ఎందుకు సమాచారాన్ని సేకరిస్తున్నారు ? వ్యక్తిగత డేటా చోరీ అయితే బాధ్యత ఎవరు వహిస్తారు ? అని గౌరవ ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనికి సమాధానం ఎక్కడ జగన్ ? వ్యక్తిగత డేటా చోరీ అయితే ముఖ్యమంత్రి జగన్ బాధ్యత వహిస్తాడా ? 151 మంది ఎమ్మెల్యేలు వహిస్తారా ? లేకపోతే 30 మంది ఎంపీలు వహిస్తారా ? అని ప్రశ్నించిన గౌరవ కోర్టుకు చెప్పే దమ్ముందా జగన్ ?
ఈ ప్రశ్నలకు సూటిగా సమాధానం ప్రజలకు చెప్పు జగన్.. వ్యక్తిగత విమర్శలకు వెళ్లకుండా అడుగుతున్న కీలకమైన సందేహాలను నివృత్తి చేయ్ జగన్ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ప్రశ్నలు సంధించారు. వాలంటీర్ సమాంతర వ్యవస్థపై, కొందరు వాలంటీర్లు చేస్తున్న నేరాలు, మహిళల అదృశ్యం వెనుక సున్నితమైన సమాచారం బయటకు వెళ్తుందన్న అంశంపై ప్రశ్నిస్తోన్న పవన్ కళ్యాణ్ బుధవారం వారాహి విజయయాత్ర తాడేపల్లిగూడెం బహిరంగసభలో మరోసారి సమాచార సేకరణ, వాలంటీర్ల వ్యవస్థ తీరుపై కీలకమైన విషయాలను బయటపెట్టారు. వాటికి ముఖ్యమంత్రి సూటిగా సమాధానం చెప్పాలని డిమాండు చేశారు.
తాడేపల్లి గూడెంలో బుధవారం జరిగిన బహిరంగసభలో వారాహి వాహనం మీదుగా పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ... "నాకు వాలంటీర్ల మీద వ్యక్తిగత ద్వేషం ఏమి లేదు. మీరు చేస్తున్న పనిని వేరే అవసరాలకు ఉపయోగిస్తున్న జగన్ తీరు మీదనే నా పోరాటం. వాలంటీర్ల వ్యవస్థలోకి కొన్ని దుష్టశక్తులు ప్రవేశించి చేస్తున్న అరాచకం మీదనే నా కోపం. ఆడబిడ్డల కదలికలపై నిరంతరం రెక్కీ నిర్వహించి, ఎవరూ లేని సమయంలో నానా రకాలుగా వారిని ఇబ్బంది పెడుతున్న కొందరు వాలంటీర్ల తీరు మీదనే నా ద్వేషం. ఆడబిడ్డలను బెదిరించి లొంగదీసుకోవాలని కొందరిపై జనవాణిలో వస్తున్న ఫిర్యాదులే నాలో అశాంతికి కారణం అని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
కోడి పిల్లలను తన్నుకుపోతున్న గద్దల్లా మారుతున్నారు
కొన్ని గ్రామాల్లో వాలంటీర్ల ముసుగులో కొన్ని అసాంఘిక శక్తులు చెలరేగిపోతున్నాయి. గ్రామాల్లో బాలికలను లొంగదీసుకునేందుకు నానా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. వారి వ్యక్తిగత విషయాలను తెలుసుకొని నానా రకాలుగా వారిని బెదిరిస్తున్నారు. కోడిపిల్లలను తన్నుకుపోయే గద్దల్లా ప్రవర్తిస్తున్నారు. 16 ఏళ్ల యువతిని శింగనమలలో అత్యాచారం చేసింది వాలంటీరే... లక్కవరంలో 8 ఏళ్ల బాలికను రేప్ చేసింది వాలాంటీరే. ఏలూరులో 8 సంవత్సరాల బాలికపై కన్నేసింది వాలంటీరే. తిరువూరు మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసింది వాలంటీరే. గుంటూరులో రౌడీయిజం, తిరుపతిలో ఎర్రచందనం, అద్దంకిలో లంచాలు తీసుకొని బహిరంగంగా దొరికిన వారు వాలంటీర్లే. మరి వీటికి సమాధానం ఎవరు చెబుతారు. కొందరు వాలంటీర్లు చేసే ఆకృత్యాలకు ఎవరు బాధ్యత తీసుకుంటారు. వాలంటీరు వ్యవస్థలోని పుచ్చులను, కుళ్లిపోయిన శక్తులను ఏరిపారేసేవారు ఎవరు ? చిన్న బిడ్డలపై వాలంటీర్లు చేస్తున్న అఘాయిత్యాలకు సమాధానం ఎక్కడ లభిస్తుంది.
వాలంటీర్ల పొట్ట కొట్టాలని, వారిని అనవసరంగా నిందించాలని నా ఉద్దేశం కాదు. వారంతా నా సోదర సమానులు. అక్కాచెల్లెళ్లు. వాలంటీర్లలో అంతా చెడ్డవాళ్లు ఉన్నారని నేను చెప్పడం లేదు. అసలు ఈ వ్యవస్థ ఎంత మేర అవసరం ? వారు చేస్తున్న పనులు ఎంత మేర మహిళల భద్రతకు కీడు చేస్తున్నాయనేది వివరిస్తున్నాను. కొందరు వాలంటీర్ల తీరు ఎలా ఉంది అంటే... మా జగనన్న 16 నెలలు జైలులో గడిపాడు. మేం కూడా అవసరం అయితే జైలుకు పోతాం అంటున్నారు. ఇది జగన్ యువతకు ఇచ్చిన వారసత్వ సంపద. ప్రజలంతా వాలంటీర్లు ఏదో చేసేస్తారు... పథకాలు ఆగిపోతాయి అనుకోకండి. ఎవరైనా వాలంటీరు ఇబ్బంది పెడితే ధైర్యంగా ముందుకు రండి. పోలీసులకు, కలెక్టరుకు ఫిర్యాదు చేయండి. మీ వెనుక జనసేన పార్టీ ఉంటుంది.
వాలంటీర్ల జీతాలు ఆంధ్రా గోల్డ్ కి ఎక్కువ.. బూంబూంకు తక్కువ
కలల ఖనిజాలతో చేసిన యువత ఆంధ్రాకు వరం కావాలని నేను కలలు కంటున్నాను. వారిలో ఉన్న తెలివి, నైపుణ్యం, ఉత్సాహం రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడాలని నేను తపిస్తూ, షణ్ముఖ వ్యూహంలో యువతను స్వయంశక్తులుగా చేసి, పదిమందికి ఉపాధి కల్పించే విజేతలుగా నిలపాలని భావిస్తున్నాను. అందుకే యువతకు ప్రభుత్వం తరఫున మూలధన పెట్టుబడి కింద, మళ్లీ చెల్లించే అవసరం లేకుండా రూ.10 లక్షలు ఇవ్వాలని, ప్రతి నియోజకవర్గంలో 500 మందిని ఇలా తయారు చేయాలని ఆశ పడుతున్నాను. జగన్ మాత్రం డిగ్రీలు, పీజీలు చదివే యువతకు జాబ్ క్యాలెండర్ లేకుండా చేసి, వారికి వేరే దారి లేకుండా మూసేసి వాలంటీర్లుగా మారుస్తున్నాడు. నెలకు రూ.5 వేల జీతం అంటే రోజుకు రూ.164.38 పైసలు చొప్పున వేతనం ఇస్తున్నాడు. ఉపాధి హామీ పథకంలో రోజువారీ కూలీ రూ.274లు వస్తుంటే, దాని కంటే తక్కువగా వేతనాలు ఇస్తూ, యువత ఆశలను చిదిమేస్తున్నాడు.
మద్యం అమ్మకాల్లో రికార్డులు సృష్టించి రూ.1.30 లక్షల కోట్లను అమ్మిన జగన్ ఆంధ్రా గోల్డ్ అనే మద్యం బ్రాండును రూ.130లకు అమ్మతున్నాడు.. బూంబూం బీర్ ను రూ.220లకు అమ్మతున్నాడు. వాలంటీర్ల రోజువారీ వేతనాలు ఆంధ్రా గోల్డ్ కంటే ఎక్కువ, బూంబూం బీర్ కంటే తక్కువ అన్నట్లు తయారు చేశాడు. జనసేన యువతను అత్యున్నన శిఖరాల వైపు నడిపించాలని, యువతను స్వయంశక్తి సాధకులుగా తయారు చేయాలని భావిస్తుంటే, జగన్ మాత్రం వారి శక్తిని నిర్వీర్యం చేసి తాను చెప్పినట్లు వినే ఓ బానిస వ్యవస్థను తయారు చేయాలని భావిస్తున్నాడు. జనసేన మొదలుపెట్టిన జనవాణి కార్యక్రమం సైతం ఓ వాలంటీరు కన్నీటి వేదన నుంచి మొదలైంది. జగన్ కు ఆకలి వేస్తే తాను పెట్టిన గుడ్లను సైతం తానే తినేసే మనస్తత్వం ఉన్న వాడు.
పాపం అని ఓటు వేస్తే.. కాటు వేశాడు
పాపమండీ తండ్రి లేని పిల్లాడు అని ప్రజలంతా ఒక్కసారి అవకాశం ఇచ్చిన పాపానికి.. జగన్ వారిని బలంగా కాటు వేశాడు. మా జగన్ బ్రాందీ, విస్కీ తాగడండీ అనుకుంటే... ప్రజలకు మాత్రం కల్తీ మద్యం అమ్మి, ప్రజల రక్తమాంసాల ద్వారా వచ్చిన డబ్బుతో పండగ చేసుకున్నాడు. నమ్మి ప్రజలు ఓట్లేస్తే లక్ష కోట్లకు కాట్లేశాడు. అమ్మే మద్యం కూడా కల్తీ మద్యం అమ్ముతూ పేదల బతుకులను హరిస్తున్నాడు. మద్యపాన నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చిన వ్యక్తి బహిరంగంగా కల్తీ మద్యం అమ్ముతూ, దానికి మన ఇంట్లోని వారు బలైపోతున్నా అడగలేని నిస్సాహాయత ఎందుకు ? దేనికి భయం ? మీకు హామీ ఇచ్చిన జగన్ మద్యం తాగడు.. కానీ ప్రజలతో తాగించి రూ.1.30 లక్షల కోట్లు మింగేస్తాడు. కల్తీ మద్యం దెబ్బకు ఆడపడుచుల తాళిబొట్లు తెంపేస్తాడు. మహిళలు హాహాకారాలు చేస్తుంటే, ఈయన వికారంగా నవ్వుతాడు. చావు ఇంటికి వెళ్లినా, పెళ్లికి వెళ్లినా అదే నవ్వు. హీరో మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ చనిపోతే ఆయన పుట్టెడు దుఖఃంలో ఉంటే... వారిని పరామర్శించడానికి వెళ్లి అక్కడ కూడా అదే నవ్వు. ఎవరైనా బాధలో ఉంటే ఈ మహానుభావుడికి ఎందుకో ఆ నవ్వు ? ఆ సంతోషం ఏమిటో అర్ధం కాదు. నాన్న చనిపోయాడు.. మా నాన్న చనిపోయాడు అని నానా రకాలుగా ప్రజలను భావోద్వేగంలోకి నెట్టేసి ముఖ్యమంత్రి అయిన జగన్ .. ఇప్పుడు ప్రజల జీవితాలను దుర్భరం చేశాడు.
ఆడబిడ్డల భద్రతను భంగం చేయని మద్యం విధానం
సంపూర్ణ మద్యపాన నిషేధం అనేది ప్రపంచంలో ఎక్కడా అమలు కాలేదు. అలా చెప్పి నేను తర్వాత మిమ్మిల్ని మోసం చేయలేను. కచ్చితంగా జనసేన ప్రభుత్వంలో ఆడబిడ్డల భద్రతకు, వారి జీవితాలకు పూర్తిస్థాయి ప్రాధాన్యం ఉంటుంది. ప్రభుత్వ మద్యం విధానం కూడా ఆడబిడ్డల భద్రతను దృష్టిలో పెట్టుకునే చేస్తాం. రాలేగావ్ సిద్ధి మోడల్‌లో మహిళలు మా ప్రాంతంలో వద్దు అన్న చోట కచ్చితంగా మద్యం దుకాణం తీసేస్తాం. పూర్తిగా మహిళలు ఆమోదించిన చోటే మద్యం దుకాణాలు పెట్టే ఏర్పాటు చేస్తాం. మద్యం అమ్మకాల రెవెన్యూ ఆధారపడకుండా నాణ్యమైన మద్యం విధానం తీసుకొస్తాం. అధిక ధరలను తగ్గించి, పాత ధరలనే తీసుకొస్తాం. కచ్చితమైన మద్యం విధానం ద్వారా పారదర్శక అమ్మకాలు చేస్తాం.
'అయోగ్యుడు మావాడు' పుస్తకం రాయండి
జగన్ జీవితం మీద సినిమాలు తీస్తున్నారు. వీడియోలు చేస్తున్నారు కదా..! ఆయన జీవితం మీద ఎవరైనా ఓ పుస్తకం రాయండి. ఆయోగ్యుడు మా వాడు అనే టైటిల్ దానికి సరిగ్గా సరిపోతుంది. దానికి నేను ముందు మాట రాస్తా. పుస్తకంలోని మొదట ఛాప్టర్‌కు సంస్కార హీనత అని రెండో ఛాప్టర్‌కు వనరులు, ఖనిజాలు, మానవ వనరుల దోపిడీ అని, మూడో ఛాప్టర్‌కు శాడిజం, పైశాచికం అని, నాలుగో ఛాప్టర్‌కు మనీ టూ పవర్ ఆఫ్ దోపిడీ అని, ఐదో ఛాప్టర్‌కు నా దౌర్జాన్యాలు, రౌడీయిజం అని పేర్లు పెట్టుకోండి. చివరి ఛాప్టర్‌కు మాత్రం ఇంత చేసి జనసేన వీర మహిళలు, జనసైనికుల వీరోచిత పోరాటానికి, విప్లవ స్ఫూర్తికి నేను ఎలా బలైపోయాను, చావుదెబ్బ తిన్నాను అనేది మాత్రం వివరించు. పుస్తకం నీతి సూత్రం మాత్రం ‘‘ నాలాగా ఎవరూ అవకండీ.. నాలాగా నాశనం అయిపోతారు’’ అని పెట్టుకో...
పెళ్లాం కాదు.. భార్య అని పిలవాలి
మీ సతీమణి భారతిని మేడం అని పిలుస్తాం. ఆమె నాకు సోదర సమానురాలు. నేను ఎప్పుడూ ఆమె గురించి కనీస ప్రస్తావన తీసుకురాను. ప్రత్యక్ష రాజకీయాల్లో లేని ఆమె గురించి మాట్లాడింది లేదు. ఈయన మాత్రం నా భార్యను పెళ్లాం అని సంబోధిస్తాడు. పిల్లల సదస్సులో పెళ్లిళ్ల ప్రస్తావన తెచ్చి దిగజారిపోతాడు. మా వీర మహిళలు పాలసీల మీద మాట్లాడితే వారిని అసభ్యంగా సోషల్ మీడియాలో తిట్టిస్తాడు. మానసికంగా వేధిస్తాడు. నేను నీ ప్రభుత్వ పాలసీల మీద మాట్లాడితే నువ్వు మా భార్యల గురించి మాట్లాడతావు. అంతకంటే సంస్కార హీనత ఏముంటుంది.. జగన్ ? హిందూ ధర్మం ప్రకారం సహధర్మచారిణి, సతీమణి, భార్య, శ్రీమతి వంటి పదాలు వారి గౌరవాన్ని పెంచే విధంగా ఉంటే.. ఈయన మాత్రం పెళ్లాం అని సంబోధిస్తాడు. అక్కడే నీ సంస్కారం ఏపాటిదో అర్ధం అవుతోంది. నీవు పదేపదే అలా మాట్లాడినపుడు నా భార్య కన్నీళ్లు పెట్టుకుంది. రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించింది. ఆమెకు క్షమాపణ చెప్పి బయటకు వచ్చాను. నువ్వు, నీ బాష ఎంత నీచత్వానికి వెళ్లిపోయిందంటే... నేను కనీసం ఊహించని విధంగా నీ ప్రవర్తన మారిపోయింది జగన్.
భవన నిర్మాణ కార్మికుల డబ్బులేం చేశావ్.. లెక్క చెప్పు
భవన నిర్మాణ కార్మికుల సెస్ సొమ్మను సంక్షేమ నిధిలో జమ చేస్తారు. ఇది భవన నిర్మాణ కార్మికులకు ఆపత్కాలంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. పెళ్లిళ్లలకు, బిడ్డల చదువులకు, అత్యవసరాల్లో ఇది వారికి సహాయం చేస్తుంది. వారు దాచుకున్న సంక్షేమ నిధి సొమ్ము రూ.1569 కోట్లలో ఇప్పుడు మిగిలింది కేవలం రూ.900 కోట్లు మాత్రమే. మిగిలిన రూ.669 కోట్లు ఎక్కడికి మళ్లించారో చెప్పాలి. ఇప్పటికీ భవన నిర్మాణ కార్మికులు సహాయం కోసం సంక్షేమ నిధి డబ్బులు ఇవ్వాలని పెట్టుకున్న క్లైములు 33 వేలు పెండింగ్‌లో ఉండిపోయాయి. వాటికి ఎప్పుడు డబ్బులిస్తారో చెప్పాలి. మైనార్టీలను జగన్ నిలువునా మోసం చేశాడు. బడ్జెట్లో రూ.16.47 కోట్లను కేటాయించారు. దానిలో మైనార్టీల కోసం ఖర్చు చేసింది కేవలం 1.20 కోట్లు మాత్రమే. అంటే కేవలం 7 శాతం. ఇదీ మైనార్టీలపై జగన్ కు ఉన్న ప్రేమ. నేను మైనార్టీలకు న్యాయం చేస్తా. అండగా నిలుస్తా. సాంఘిక సంక్షేమ శాఖకు ప్రభుత్వం రూ.291.07 కోట్లు కేటాయిస్తే, ఖర్చు చేసింది కేవలం రూ.64.08 కోట్లు. బీసీ సంక్షేమానికి బడ్జెట్ లో కేటాయించిన దానిలో ఖర్చు చేసింది కేవలం రూ.25 కోట్లు మాత్రమే. జగన్ మనోడే అని దళిత సమాజం అక్కున చేర్చుకుని అందలం ఎక్కించింది. ఏపీ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుతో రూ. 336.47 కోట్లు అప్పు తీసుకొచ్చి వాటిని పక్కదారి పట్టించాడు. దళితుల పేరుతో, వారికి ఉపయోగించాల్సిన నిధులు దారి మళ్లాయి.
అంటే కేటాయించిన సొమ్ములు ఎక్కడికి వెళ్తున్నాయి..? ఎటు మళ్లిస్తున్నారు..? ఇది ఆయా వర్గాలను మోసం చేయడం కాదా..?
దళిత సమాజానికి ఒకటే చెబుతున్నా మనోడా కాదా అని చూడకండి మనకు న్యాయం చేయడానికి సరైనోడా? కాదా? అని మాత్రమే ఆలోచించండి. అంబేడ్కర్ రాజ్యాంగం అమలు కావాలంటే జనసేన అధికారంలోకి రావాలి.
గెలిచిన వెంటనే నన్ను ఏకవచనంతో పిలిచాడు
జగన్ భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకరానికి పిలిచాడు. పవన్ నువ్వు రావాలని ఏకవచనంతోనే పిలిచాడు. అప్పట్లో కొన్ని కారణాలు చెప్పి.. జగన్ గారు రాలేనని మర్యాదగా చెప్పాను. ఇప్పుడెందుకు ఏకవచనంతో మాట్లాడుతున్నానంటే... ఆయన ఇంట్లోని మహిళల గురించి నీచంగా మాట్లాడుతున్నాడు. మధ్యయుగంలో కూడా మహిళల గురించి తప్పుగా మాట్లాడేవారు కాదు. అలాంటిది జగన్ దిగజారిపోయి మరీ మాట్లాడటం వల్లనే నేను నువ్వు అని పిలుస్తున్నాను.
పన్నులు తప్ప పనులు చేయని ప్రభుత్వం ఇది
అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి తీసుకొచ్చిన రూ. 363.81 కోట్ల అప్పు ఎందుకు బడ్జెట్ లో చూపించలేదు? ఆ డబ్బును జగన్ ఎం చేశాడు? తాడేపల్లిగూడెంలో గ్యాస్ పైప్ లైన్ కోసం తవ్విన గుంతలను కనీసం పూడ్చలేదు. జువ్వలపాలెం – కుంతలపల్లె ఫ్లై ఓవర్ నిర్మించలేదు. కోడేరు - నల్లజర్ల రోడ్లు విస్తరణ చేయలేదు. పోలవరం ఎలానూ పూర్తి చేయలేరు కనీసం ఎర్రకాలువ గండ్లు కూడా పూడ్చలేకపోయారు. రూ. 30 కోట్లు ఖర్చు చేస్తే అయిపోయే పనులు కూడా పూర్తి చేయలేకపోయారు. 5 వేలకు పైగా నిర్మించిన టిడ్కో ఇళ్లకుగానూ వెయ్యి మాత్రమే లబ్ధిదారులకు ఇచ్చారు. మిగిలిన 4వేలకు పై చిలుకు టిడ్కో ఇళ్లల్లో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. చెత్తపై కూడా పన్ను వేసిన చెత్త ప్రభుత్వం ఇది. స్థలాలు అప్పగించకుండానే టీడీఆర్ బాండ్లలో రూ. 18 కోట్లు దోచేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్. యువతకు ఉపాధి కల్పించరు. పరిశ్రమలు రానివ్వరు. పారిశ్రామిక వేత్తలను లంచాలతో పీడిస్తారు. పన్నులు తప్ప పనులు చేయవు. నిరుద్యోగం పెరిగిపోయి యువత రోడ్లపైకి రాక ఎక్కడికి పోతారు. మీలాగా, మీనాన్నలాగా 6 శాతం వాటాలతో దోచేసిన డబ్బులు లేవు. మరి ఎలా బతకాలి?
అంగన్వాడీలను పోలీసులతో కొట్టిస్తున్నారు
అంగన్ వాడీలకు తెలంగాణలో రూ. 13,800 జీతం ఇస్తున్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే దాని మీద ఒక్క రూపాయి అయినా ఎక్కువ వేసి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఇప్పుడా హామీ నిలబెట్టుకోవాలని అంగన్ వాడీలు డిమాండ్ చేస్తే వాళ్లను దారుణంగా పోలీసులతో కొట్టిస్తున్నావు. 2017 నుంచి ఇప్పటి వరకు ట్రావెలింగ్ అలవెన్సులు కూడా ఇవ్వలేదు. వైసీపీ ఎంత నీచానికి ఒడిగట్టిందంటే తన హక్కులు గురించి ప్రశ్నించినందుకు ప్రకాశం జిల్లా టంగుటూరులో హనుమాయమ్మ అనే అంగన్ వాడీ కార్యకర్తను వైసీపీ కార్యకర్తలు చంపేశారు. జగన్ ప్రభుత్వంలో ఆడపడుచులకు రక్షణ ఏదీ? సంక్షేమం పేరుతో చేసిన అప్పులు ఎక్కడికి పోతున్నాయి? సూట్ కేసు కంపెనీల కోసం మారిషస్ పట్టుకుపోతున్నారా?
ప్రజాధనం లూటీ ఇలా చేస్తున్నాడు
ముఖ్యమంత్రి జగన్ దాదాపు లక్ష కోట్ల ప్రజాధనం దోచేశాడు అంటారు. అది ఎలాగంటే మద్యం అమ్మకాల్లో దొంగ లెక్కలు చూపించి రూ. 30 వేల కోట్లు దోచేశాడు. ఇసుక, మైన్స్ లో రూ. 40 వేల కోట్లు, సిమెంట్ కంపెనీలు పెట్టి రూ. 20 వేల కోట్లు, ఇతరత్ర అక్రమ వ్యాపారాలతో మరో రూ. 10 వేల కోట్లు ఇలా దాదాపు లక్ష కోట్లు జగన్ దోచేశాడు. సాక్షి సర్క్యూలేషన్ పెంచడానికి వాలంటీర్లకు ఇస్తున్న జీతంలో రూ. 200 కట్ చేస్తున్నారు. వాలంటీర్లకు నెలకు రూ.5,200 గౌరవ వేతనం కింద ప్రజాధనం ఇస్తున్నారు. అందులో రూ. 180 సాక్షి పేపర్ కొనాలని కండీషన్ పెట్టారు. ఏ పేపర్ చదవాలో కూడా జగనే డిసైడ్ చేస్తున్నాడు. పేపర్ కోసమని నెలకు రూ. 3.60 కోట్లు చొప్పున సంవత్సరానికి రూ. 43.20 కోట్ల ప్రజాధనాన్ని సాక్షి పేపర్ కు కట్టబెడుతున్నాడు.
మిలిటరీ మాధవరానికి జనసేన అండగా ఉంటుంది
తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో సైనికులకు పుట్టినిల్లుగా మిలిటరీ మాధవరం అనే గ్రామాన్ని చెప్పుకుంటారు. గ్రామం నుంచి దాదాపు 2,700 మంది సైనికులు దేశ రక్షణలో సేవలందించారు. ఈ రోజుకు త్రివిధ దళాలలో దాదాపు 250 మందికి పైగా సేవలందిస్తున్నారు. అలాంటి ఊరులో కనీస మౌలిక సదుపాయాలు ఈ ప్రభుత్వం కల్పించలేకపోయింది. దేశ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టిన వీరులు ఉన్న ఊరునే ఈ ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదు. అలాంటి గ్రామానికి జనసేన అండగా ఉంటుంది. దోచుకోవడమే పనిగా పెట్టుకున్న ఈ వైసీపీ ప్రభుత్వం సైనికుల ఇళ్ల స్థలాలను కూడా వదలడం లేదు. రెడ్డి ప్రసాద్ అనే సైనికుడి ఇంటి స్థలాన్ని వైసీపీ నాయకులు కబ్జా చేశారు. మనందరికి రక్షణ కోసం బోర్డర్ లో పహారా కాసిన వ్యక్తితో ఈ రోజు కన్నీరు పెట్టిస్తున్నారు.
సొంత తల్లి, చెల్లినే బయటకు పంపించినోడికి ప్రజలపై ప్రేమ ఉంటుందా?
సక్రమంగా సినిమాలు చేసుకుంటే ఏడాదికి వందల కోట్లు సంపాదించే సామర్థ్యం ఉంది. రాజకీయాల్లోకి రాకపోతే నన్ను, నా కుటుంబాన్ని ఏ ఒక్కరు కూడా పల్లెత్తి మాట మాట్లాడరు. అయితే గొప్ప గొప్ప మహానుభావుల ప్రేరణతో మనవంతు ప్రజలకు ఏదైనా చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చాను. ఈ రోజు ఓడిపోయినా మీకోసమే నిలబడ్డాను. ముష్కరులు, క్రిమినల్స్, సొంత చిన్నాన్ననే గొడ్డలితో చంపేసిన వ్యక్తులతో పోరాటం చేస్తున్నాను. సొంత తల్లి, చెల్లినే బయటకు పంపించిన వ్యక్తికి ప్రజలపై ప్రేమ ఎలా ఉంటుంది? ఇతరుల ఇంట్లో మహిళలపై గౌరవం ఎలా ఉంటుంది?
ఇది కూడా చదవండి : AP Early Polls: ఏపీలో ముందస్తు ఎన్నికలు, క్లారిటీ ఇచ్చేసిన వైఎస్ జగన్
లలితకళలు అంటే.. లలిత, కళ అనుకొనే రకం
నన్ను చంపేస్తామని బెదిరిస్తారు. ఇంట్లో ఆడవాళ్ల, బిడ్డలను తిడతారు. వ్యక్తిగత విమర్శలు చేస్తారు ఇవన్నీ కేవలం ప్రజల కోసం, రాష్ట్రానికి స్థిరమైన ప్రభుత్వం ఇవ్వాలనే భరిస్తున్నాను. లేకపోతే ఇలాంటి సంస్కార హీనుడుతో నా భార్యను తిట్టించుకోవాల్సిన అవసరం లేదు. లలితకళలు అంటే.. లలిత, కళ అనుకొనే రకం. వైసీపీ వాళ్ల రాజకీయ లబ్ధికోసం ఎంతకైనా దిగజారుతారు. ముఖ్యమంత్రి సతీమణి శ్రీమతి భారతీ గారికి ఒకటే వేడుకుంటున్నాం. మీ ఆయన్ను నోరు అదుపులో పెట్టుకోమని చెప్పండి. అలాగే మీ పార్టీ సోషల్ మీడియాలో ఆడబిడ్డలను వ్యక్తిత్వ హననం చేయొద్దని చెప్పండి. వైసీపీ నాయకుల దగ్గర డబ్బులు, గుండాలు ఉండొచ్చు. కానీ చివరకు ధర్మం ఎటువైపు ఉంటే వాళ్లదే గెలుపు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీదే గెలుపు అని గుర్తు పెట్టుకోండి’’ పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తంచేశారు.
ఇది కూడా చదవండి : AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు, అసైన్డ్ భూములకు హక్కులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK