Pawan Kalyan: బెజవాడ దుర్గమ్మ సాక్షిగా గెలుస్తాం.. ప్రధాని మోదీ ముందు పవన్ ఆవేశం

Prajagalam Public Meeting Updates: ఐదు కోట్ల మంది ఆంధ్రులకు నేనున్నాంటూ భరోసా ఇచ్చేందుకు ప్రధాని మోదీ ఇక్కడికి వచ్చారని పవన్ కళ్యాణ్ అన్నారు. మూడోసారి మోదీ ప్రధాని అవ్వడం ఖాయమన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని సాధించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.    

Written by - Ashok Krindinti | Last Updated : Mar 17, 2024, 07:27 PM IST
Pawan Kalyan: బెజవాడ దుర్గమ్మ సాక్షిగా గెలుస్తాం.. ప్రధాని మోదీ ముందు పవన్ ఆవేశం

Prajagalam Public Meeting Updates: ప్రధాని మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని కాబోతూ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జోస్యం చెప్పారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో బొప్పూడిలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరవ్వగా.. మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. పితృదేవతల ముక్తి కోసం పరితపిస్తూ వారి వారసులు హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న గంగోత్రి కోసం ఎలా ఎదురుచూస్తున్నారో ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాక కోసం రాష్ట్రం ఎదురుచూస్తోందని అన్నారు. అభివృద్ధి లేమి, అప్పులతో ఆంధ్ర ప్రజానీకం కుంగిపోతోందని.. దాష్టీకం, దోపిడీతో ఆంధ్ర ప్రజానీకం, అవినీతి నలిగిపోతోందన్నారు. అప్రజాస్వామి విధానాలతో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్ర ప్రజానీకానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాక గంగమ్మ తల్లి హిమాలయాల నుంచి భూమి మీదకు వచ్చి సేదతీర్చినట్లుగా ఉందన్నారు.

Also Read: BRS Party: రేవంత్‌ రెడ్డి వంద రోజుల మోసపు పాలన.. వంద తప్పులు.. వంద ప్రశ్నలు

"ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాక, ఈ ఎన్డీఏ పునర్ కలయిక 5 కోట్ల మంది ప్రజలకు ఆనందాన్ని ఇచ్చింది. దేశ ప్రజల ఆశీస్సులతో మోడీజీ ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారు. హ్యాట్రిక్ కొట్టబోతున్న నరేంద్రమోదీకి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపు నుంచి, ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైన మూడు పార్టీలు టీడీపీ-జనసేన-బీజేపీ తరపున అభినందనలు. 2014లో తిరుపతి బాలాజీ, వేంకటేశ్వరస్వామి సాక్షిగా ఈ పొత్తు మొదలైంది. ఈ రోజు ఇక్కడ 2024న బెజవాడ కనకదుర్గమ్మ సాక్షిగా ఈ పొత్తు వేరే రూపం తీసుకోబోతోంది. ఆ దుర్గమ్మ తల్లి పొత్తును స్వయంగా ఆశీర్వదిస్తోంది. ఆంధ్రుల రాజధాని అమరావతి దేదీప్యమానంగా వెలగాలని, దానికి నేను అండగా ఉన్నానని మోదీ గారు ఇక్కడకు వచ్చారు. 

మన కష్టాలకు భుజం కాయడానికి ఐదు కోట్ల మంది ప్రజల కోసం నేనున్నానని వచ్చిన మోదీ గారికి మరొక్కసారి ఘనస్వాగతం పలుకుదాం. 2014లో తిరుపతి బాలాజీ ఆశీస్సులతో ఎన్డీఏ విజయాన్ని సాధించి, ప్రభుత్వాన్ని స్థాపించింది. 2024లో దుర్గమ్మ ఆశీస్సులతో మొదలుపెడుతున్నాం.. అంతకుమించి ఘన విజయం సాధించబోతున్నాం. ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. బిడ్డలకు అండగా ఉండే దుర్గమ్మ తల్లి మనకు ఒక్క ముద్ద ఎక్కువగానే పెడుతుంది. ఆ తల్లి ఆశీస్సులతో ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. 

మోదీ దేశాన్ని డిజిటల్ భారత్‌గా చేస్తే.. ఇక్కడున్న వైసీపీ ప్రభుత్వం మాత్రం అవినీతి జపం చేస్తోంది. మోదీ దేశంలో అవినీతి తగ్గించేందుకు చర్యలు చేపడితే, ఏపీలో మాత్రం బ్లాక్ మనీకి గేట్లు తెరిచారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని అధికారంలోకి వచ్చిన వ్యక్తి నేడు సారా వ్యాపారిగా మారిపోయారు. ఐదేళ్లలో రూ.1,13,580 కోట్ల మద్యం విక్రయాలు జరిగితే, అధికారికంగా మాత్రం రూ.84,050 కోట్లు మాత్రమే చూపిస్తున్నారు. 10 వేల కోట్ల జీఎస్టీ ఎగవేసి అవినీతికి పాల్పడ్డారు. అలాగే బినామీ కంపెనీ జేపీ వెంచర్స్ పేరు మీద ఆ ఐదేళ్లలో ఇసుక ద్వారా రూ.40 వేల కోట్లు దోచుకున్నారు. ఈ అవినీతిని ప్రశ్నించిన వారిని నిర్దాక్షణ్యంగా చంపేస్తున్నారు.

వైఎస్ వివేకాను కిరాతంగా మర్డర్ చేశారు. చంద్రబాబును ఇబ్బంది పెట్టారు. నన్ను అనేక పర్యాయాలు అడ్డుకున్నారు. ఈ అరాచక ప్రభుత్వం పోవాలి. డబ్బులు ఎక్కువై జగన్ అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. రావణాసురుడు కూడా అదేవిధంగా అనుకున్నాడు. నార చీర కట్టుకుని సీతమ్మ తల్లి కోపంతో హతమయ్యాడు. జగన్ రాష్ట్రాన్ని రావణకాష్టం చేశాడు. అయోధ్యకే రాముడిని తీసుకువచ్చిన మోడీ ఇక్కడున్నారు. చిటికెన వేలంత జగన్ రెడ్డిని ఇంటికి పంపడం ఆయనకు కష్టమేం కాదు. ఎన్నికల కురుక్షేత్రం యుద్ధంలో నరేంద్రమోదీ పాంచజన్యాన్ని పూరించి జగన్ రెడ్డిని తరిమికొడతారు. రాబోయే ఎన్నికల్లో పొత్తుదే గెలుపు, కూటమిదే విజయం. ధర్మానిదే విజయం.." అని పవన్ కళ్యాణ్‌ అన్నారు. 

Also Read: Summer Heat Stroke: దంచికొడుతున్న ఎండలు.. ఈ సింప్టమ్స్ కన్పిస్తే వడదెబ్బ తగిలినట్లే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News