నేను త్వరలో సినిమా చేయబోతున్నానా.. ఎవరు చెప్పారు: పవన్ కళ్యాణ్

   

Last Updated : Nov 21, 2018, 03:05 PM IST
నేను త్వరలో సినిమా చేయబోతున్నానా.. ఎవరు చెప్పారు: పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో ఓ సినిమా చేయబోతున్నారని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఈ వార్తలో ఏ మాత్రమూ నిజం లేదని ఆయన ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఇలాంటి వార్తల్లో నిజం లేదని.. ఏ చిత్రంలోనూ తాను నటించడానికి అంగీకారం తెలపలేదని పవన్ అన్నారు. సినిమాల్లో నటించేందుకు తగ్గ సమయం తన వద్ద లేదని.. తాను పూర్తిగా ప్రజా జీవితానికే సమయాన్ని కేటాయించానని ఆయన చెప్పారు. ప్రజల్లోనే ఉంటూ.. జనసైనికులు, అభిమానులతో కలిసి పాలకుల తప్పిదాలను బలంగా వినిపిస్తున్నానని.. సినిమాల గురించి ఆలోచించడం లేదని పవన్ తేల్చి చెప్పారు.

తన ఆలోచనలు అన్ని ప్రజా క్షేమం కోసమేనని.. తన తపన అంతా సమ సమాజ స్థాపన కోసమేనని పవన్ అన్నారు. నిన్నే జనసేన తమ పార్టీ తరఫున అధికారిక టెలిగ్రామ్ ఛానల్ కూడా ప్రారంభించడం జరిగింది. అలాగే తెలంగాణ ఎన్నికల విషయంపై కూడా పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం తాము అసెంబ్లీ ఎన్నికలలో జనసేన తరఫున తెలంగాణలో పోటీ చేయడం లేదని ఆయన తెలిపారు. 

అయితే లోక్ సభ ఎన్నికలలో తెలంగాణలో జనసేన తమ పార్టీ తరఫున అభ్యర్థులను బరిలోకి దింపుతుందని పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. అందుకోసం జనసేన ఇప్పటి నుండే ప్రణాళికలు వేస్తుందని.. జనసేన కార్యకర్తలు అందరూ కూడా సమాయత్తమవుతారని.. ఇది ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయమని పవన్ అన్నారు. 

Trending News