ఏపీ సీఎం చంద్రబాబును ఏకిపారేసిన ప్రధాని నరేంద్ర మోదీ

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును ఏకిపారేసిన ప్రధాని నరేంద్ర మోదీ

Last Updated : Feb 10, 2019, 05:42 PM IST
ఏపీ సీఎం చంద్రబాబును ఏకిపారేసిన ప్రధాని నరేంద్ర మోదీ

గుంటూరు: గుంటూరులో జరిగిన బహిరంగ సభలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గుంటూరు వేదికగా చమురు నిల్వలకు సంబంధించి మూడు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు నేడు శ్రీకారం చుట్టిన ప్రధానమంత్రి అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని ఏపీ సర్కార్ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. పదేపదే తాను ప్రధాని మోదీ కన్నా సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఒక సీనియర్ నాయకుడిగా ఏం సాధించారో తెలియదని ఎద్దేవా చేశారు. సొంత మామను వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు సీనియర్‌... పొత్తులు, కూటములు మార్చడంలో చంద్రబాబు సీనియర్‌... ఏపీ ప్రజల స్వప్నాలు ధ్వంసం చేయడంలోనూ ఆయన సీనియరే. తనను గతంలో తిట్టిన వాళ్లతో కలిసిపోవడంలోనూ సీనియర్‌. ఒకసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత మరోసారి ఎన్నికల్లో ఓడిపోవడంలోనూ బాబు సీనియరేనని ఏపీ సీఎంపై మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

రాష్ట్రాభివృద్ధిని పక్కనబెట్టి తనను తిట్టడమే పనిగా చంద్రబాబు ముందుకు వెళ్తోంటే.. తాను మాత్రమే ఏపీ అభివృద్ధి కోసం పాటుపడుతున్నాను అని ఏపీ ప్రజలకు మోదీ తెలియజెప్పే ప్రయత్నం చేశారు. రాష్ట్రాభివృద్ధికి కృషిచేస్తానని రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు ఇచ్చిన మాటను తప్పితే.. దేశ ప్రజల సేవకుడిగా తానే చంద్రబాబును కచ్చితంగా ప్రశ్నిస్తానని అన్నారు.

చంద్రబాబు, లోకేష్‌పై వ్యక్తిగత విమర్శలు:
అమరావతి నిర్మాణం పేరిట కూలిపోయిన తన పార్టీని తిరిగి నిర్మించుకునే పనిలో చంద్రబాబు బిజీగా ఉన్నారని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. తన కొడుకును రాజకీయంగా నిలబెట్టే క్రమంలో రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలేశారని విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్‌ కలలను ధ్వంసం చేసిన చంద్రబాబు ఇవాళ తన గతాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారు. తనని తాను ఎన్టీఆర్‌ వారసుడిగా చెప్పుకునే చంద్రబాబు.. ఆ ఎన్టీఆర్‌ కలలనే చెరిపేశారు. ఎన్టీఆర్‌ బతికున్నంత కాలం విమర్శించిన కాంగ్రెస్‌ పార్టీతోనే చంద్రబాబు పొత్తు పెట్టుకోవడంకన్నా ఎన్టీఆర్‌కు అవమానం ఇంకేం ఉంటుందని మోదీ ప్రశ్నించారు.

Trending News