శ్రీకాకుళం ప్రజలను అధికారులు బెదిరిస్తే.. తోలు తీస్తా: పవన్ కళ్యాణ్

తిత్లీ తుఫాను ప్రభావం వల్ల తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం వాసులకు న్యాయం జరగాలని.. వారికి ప్రభుత్వం న్యాయం చేసేవరకూ పోరాడతానని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. 

Last Updated : Oct 19, 2018, 02:30 PM IST
శ్రీకాకుళం ప్రజలను అధికారులు బెదిరిస్తే.. తోలు తీస్తా: పవన్ కళ్యాణ్

తిత్లీ తుఫాను ప్రభావం వల్ల తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం వాసులకు న్యాయం జరగాలని.. వారికి ప్రభుత్వం న్యాయం చేసేవరకూ పోరాడతానని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. తనకు సిక్కోలు ప్రాంతమంటే ఎంతో అభిమానమని.. పచ్చటి  ఉద్ధానం అంటే ఎంతో ఇష్టమని.. కానీ తుఫాను తీవ్రత వల్ల అక్కడ జరిగిన నాశనం తనకు కన్నీళ్లు తెప్పిస్తుందని పవన్ అన్నారు. ఉద్దానంలో జరిగిన నష్టాన్ని ప్రపంచానికి తెలిపేందుకు జనసేన టీమ్ వీడియోలు తీస్తుందని.. వాటిని ప్రజలలోకి తీసుకెళ్తుందని పవన్  కళ్యాణ్ అన్నారు. తాను ఒకప్పుడు ఇదే ప్రాంతంలో కిడ్నీ రోగ బాధితుల కోసం పోరాడానని.. అలాగే ఇప్పుడు తిత్లీ బాధితుల కోసం కూడా పోరాడతానని ఆయన అన్నారు.

బాధితులకు సర్కారు చేస్తున్న సహాయం పట్ల తాను ఏ విధంగానూ సంతృప్తితో లేనని పవన్ అన్నారు. శ్రీకాకుళం పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉందని.. అయినా కొందరు అధికారులు వారిని బెదిరించడమే పనిగా పెట్టుకున్నారని.. అలా ఎవరైనా చేస్తున్నట్లు తనకు తెలిస్తే వారి తోలు తీస్తానని పవన్ తెలిపారు. తిత్లీ తుఫాను బాధితులను పరామర్శించడం కోసం మూడు రోజుల పర్యటనకు శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్ తొలిరోజు భావనపాడు, దేవనల్తాడ, పొల్లాడ, పాతటెక్కలి, అమలపాడు మొదలైన గ్రామాల్లో పర్యటించారు. 

తిత్లీ బాధితుల కోసం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని.. కానీ జనసేన మాత్రం రంగాల వారీగా నష్టాల నివేదికను తయారుచేస్తోందని.. ఆ నివేదికను కేంద్రానికి పంపిస్తుందని పవన్ తెలియజేశారు. బాధిత గ్రామాలకు పదేళ్ళపాటు నష్టపరిహారం  ఇవ్వాలని తాను డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. కేరళలో తుఫాను వస్తే.. యావత్ ప్రపంచానికి తెలిసిందని.. కానీ తిత్లీ తుఫాను వల్ల ఇంత నష్టం జరిగినా కూడా ప్రభుత్వం ఏమీ పట్టన్నట్లు వ్యవహరిస్తోందని పవన్ అన్నారు. తన పర్యటనలో భాగంగా భావనపాడులో  బుధవారం మధ్యాహ్నం పవన్‌ కల్యాణ్‌ ‘రచ్చబండ’ కార్యక్రమాన్ని నిర్వహించి... బాధితుల సమస్యలను తన పుస్తకంలో రాసుకున్నారు. ఆ సమస్యలను అన్నింటినీ పరిష్కరించడానికి నడుం బిగిస్తానని ఆయన తెలిపారు. 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x