హత్యాయత్నంపై హైకోర్టులో జగన్ రిట్ పిటిషన్ దాఖలు ; ఇది రాజకీయ కుట్ర అంటూ ఆరోపణ

                                        

Updated: Oct 31, 2018, 09:20 PM IST
హత్యాయత్నంపై హైకోర్టులో జగన్ రిట్ పిటిషన్ దాఖలు ; ఇది రాజకీయ కుట్ర అంటూ ఆరోపణ

తనపై జరిగిన హత్యాయత్నంపై వైఎస్ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ ప్రభుత్వం వైఫల్యం వల్లే తనపై దాడి జరిగిందని జగన్  పిటిషన్ లో పేర్కొన్నారు. తనను అంతం చేయాలనే కుట్రతోనే శ్రీనివాస్ అనే యువకుడి చేత తనపై దాడి చేయించారని పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ సంస్థలపై తనకు నమ్మకం లేదని.. కేంద్ర ప్రభుత్వ సంస్థలతో విచారణ జరిపించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ రిట్ పిటిషన్ లో ప్రతివాదులుగా ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డీజీపీతో పాటు మరో ఆరుగురి పేర్లు ఉంచినట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.  

విశాఖ ఎయిర్ పోర్టులో  జరిగిన దాడి ఈ నేపథ్యంలో జగన్ ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఈ విషయంలో ఇప్పటికే వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి వేసిన పిటిషన్ తో పాటు మరో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్లఫై విచారణ హైకోర్టు వాయిదా వేసింది. ఈ రెండు పిటిషన్లు దాఖలైనప్పటికీ జగన్ స్వయంగా పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. 

జగన్ దాడి ఘటనపై టీడీపీ వాదన మరోలా ఉంది. జగన్ పై  దాడి ఎయిర్ పోర్టు వీఐపీ లాంచ్ లో జరిగినందున.. ఇది ఎయిర్ పోర్టు అధికారుల పరిధిలో ఉంటుందని..కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ పరధిలో ఉండదని టీడీపీ నేతలు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆరోపిస్తూ జగన్ వేసిన పిటిషన్ పై   హైకోర్టు ఏ మేరకు స్పందిస్తుందనే దానిపై ఉత్కంఠత నెలకొంది.