ఎస్ఎస్ రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయకు ప్రముఖ సినీనటుడు జగపతి బాబు తమ కుటుంబంలోకి సాదర స్వాగతం పలికారు. కార్తికేయ కుటుంబం రాకతో తమ కుటుంబం పరిపూర్ణమైన కుటుంబంగా మారిందని ట్వీట్ చేసిన జగ్గూభాయ్.. అదే ట్వీట్ ద్వారా అల్లుడు గారికి స్వాగతం అంటూ కార్తికేయకు ఆహ్వానం పలికారు. జగపతి బాబు సోదరుడు రాంప్రసాద్ కూతురినే ఇటీవల ఎస్ఎస్ కార్తికేయ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. జైపూర్‌లో డిసెంబర్ 30న అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు ఇతర సినీపరిశ్రమలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు భారీ సంఖ్యలో హాజరై నూతన జంటను ఆశీర్వదించారు.