నటీనటులు: రవితేజ, జగపతిబాబు, సిద్దు జొన్నలగడ్డ, భాగ్యశ్రీ భోర్సే, తనికెళ్ల భరణి, గౌతమి, సచిన్ ఖేర్, బాబు మోహన్, శుభలేఖ సుధాకర్ తదితరులు
ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి
సినిమాటోగ్రఫీ: అయనంకా బోస్
సంగీతం: మిక్కీ జే మేయర్
నిర్మాత: టీజీ విశ్వప్రసాద్, భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్, అభిషేక్ పాఠక్
దర్శకత్వం: ఎస్.హరీష్ శంకర్
రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్ అనగానే.. గతంలో వీళ్ల కాంబినేషన్ లో వచ్చిన ‘మిరపకాయ్’ సినిమా గుర్తుకు వస్తోంది. అంతకు ముందు వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘షాక్’ మూవీ వచ్చినా.. ‘మిరపకాయ్’ సినిమా మాత్రం తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది. ఇపుడు చాలా యేళ్ల తర్వాత వీళ్లిద్దరి కలిసి ‘మిస్టర్ బచ్చన్’ తో ఆడియన్స్ ముందుకు వచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదలైన ఈ సినిమా ఎలా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.
కథ విషయానికొస్తే..
‘మిస్టర్ బచ్చన్’ (రవితేజ) నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. ఓ సారి తన రెయిడ్ లో ఓ పెద్ద వ్యాపారవేత్తను ట్రాప్ చేసి పట్టుకుంటాడు. ఆ తర్వాత కట్ చేస్తే.. మిస్టర్ బచ్చన్ ఉద్యోగం నుంచి సస్పెండ్ అవుతాడు. దీంతో తన సొంత ఊరికి వస్తాడు. అక్కడ అతనికి పెద్ద మ్యూజిక్ ట్రూప్ ఉంటుంది. అక్కడ స్థానికంగా ఉండే జిక్కి (భాగ్యశ్రీ భోర్సే)ని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కట్ చేస్తే.. ఆ ఊర్లో ముత్యం జగ్గయ్య (జగపతిబాబు)నే రూలింగ్ పార్టీ ఎంపీ ఉంటాడు. అతని చేయని అక్రమాలు ఉండవు. ఎవరైన ప్రభుత్వ అధికారులు తన జోలికి వస్తే.. వాళ్ల ప్రాణం తీసేంత క్రూరుడు. ఈ క్రమంలో ఇంకమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ వాళ్లు మిస్టర్ బచ్చన్ పై ఉన్న సస్పెన్షన్ ఎత్తేస్తారు. అంతేకాదు అతనికి ముత్యం జగ్గయ్య ఇంటిపై ఇంకమ్ టాక్స్ రెయిడ్ చేయమని ఓ పెద్ద టాస్క్ అప్పగిస్తారు. ఆ తర్వాత మిస్టర్ బచ్చన్ జగ్గయ్య ఇంటిపై తన సిబ్బందితో కలిసి ఐటీ దాడులు నిర్వహిస్తాడు. ఈ క్రమంలో మిస్టర్ బచ్చన్ ప్రభుత్వం తనకు అప్పగించిన పనిని పూర్తి చేసాడా లేదా అనేదే ఈ సినిమా స్టోరీ.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
డైరెక్టర్ హరీష్ శంకర్ స్వతహాగా అమితాబ్ బచ్చన్ అభిమాని. మరోవైపపు మాస్ మహారాజ్ రవితేజ కూడా అమితాబ్ ఫ్యాన్ అని పలు సందర్భాల్లో తమ అభిమానాన్ని చాటుకుంటూనే ఉన్నాడు. ఈ క్రమంలో షోలో సినిమాలో ‘గబ్బర్ సింగ్’ పాత్ర టైటిల్ తో ‘దబాంగ్’ మూవీని తెరకెక్కించి పవన్ కళ్యాణ్ కు మంచి హిట్ అందించాడు హరీష్ శంకర్. ఇపుడు అదే రూట్లో ఏకంగా అమితాబ్ బచ్చన్ పేరుతో ఈ సినిమాకు ‘మిస్టర్ బచ్చన్’ అనే టైటిల్ తో ఆడియన్స్ ముందుకొచ్చాడు. ఇక హీరోకు బచ్చన్ టైటిల్ పెట్టడం వెనక సిల్లీ రీజన్ చూపించాడు. హీరో వాళ్ల నాన్న (తనికెళ్ల భరణి) అమితాబ్ బచ్చన్ ఫ్యాన్. షోలో సినిమాను దాదాపు 50 సార్లు చూసిన అభిమానంతో తన కుమారుడికి బచ్చన్ అని ముద్దుగా పేరు పెడతాడు. మరోవైపు తన పేరును ఠాకూర్ గా.. భార్య పేరును బసంతిగా పెట్టుకుంటాడు. ఇంటిపేరు రాయఘడ్ పెట్టేంత పిచ్చి. ఇక ‘షోలే’ సినిమాలో అమితాబ్ పేరు ‘జై’ ఉంటుంది. కానీ ఈ సినిమాలో హీరో పేరు జై కాకుండా డైరెక్ట్ గా బచ్చన్ పేరు పెట్టడమే పెద్ద విచిత్రం.
అక్కడ లాజిక్ మిస్ అయినట్టు.. హీరో తన ఊర్లో తన పక్కింట్లో ఉన్న అమ్మాయిని ఎన్నడు చూడనట్టు..సస్పెన్షన్ కు గురైన తర్వాత ఊర్లోకి వచ్చినపుడు తొలిసారి ఓ గుడిలో ఆమె చూసి ప్రేమలో పడిపోవడం అనేది లాజిక్ కు అందదు. ఇలాంటి సిల్లీ రీజన్స్ పక్కన పెడితే.. దర్శకుడు హరీష్ శంకర్ ‘రెయిడ్’ సినిమాలోని కథను తెలుగు నేటివిటీకి తగ్గట్టు పూర్తిగా మార్చుకొని రాసుకున్నాడు. కానీ ఒరిజినల్ హిందీలో సెకండాఫ్ లో ఉన్న ఎమోషన్ తెలుగులో అంతగా కనిపించదు. అక్కడ హీరోయిజం కాకుండా... కథను నాచురల్ చూపించే ప్రయత్నం చేసారు. తెలుగులో పూర్తిగా హీరోయిజం ఎలివేషన్స్ తో తనదైన శైలిలో సిల్వర్ స్క్రీన్ పై బిర్యానీలా ఈ కథను ప్రేక్షకులకు ప్రెజెంట్ చేసాడు హరీష్ శంకర్ . రియల్ లైఫ్ లో ఒక ఇంకమ్ టాక్స్ ఆఫీసర్ ఒకేసారి ఎంతో మందిని కుమ్మేయడం నిజంగా సాధ్యమా అంటే కాదు. సినిమా కాబట్టి సర్ధుకుపోవాలి. మొత్తంగా హిందీలో సినిమాలో ఎమోషన్ అనే ఆత్మ తెలుగులో మిస్ అయినట్టు కనిపిస్తుంది. ఇది బిహార్ లో జరిగిన యదార్ధ సంఘటన ఆధారంగా తెరకెక్కించారు. ఇక హిందీ ఒరిజినల్ వెర్షన్ చూడని వాళ్లకు మాత్రం ఈ సినిమా నచ్చుతుంది. ఇక హిందీలో కాస్త డ్రై గా ఉన్న సబ్జెక్ట్ ను అందంగా ఏర్చికూర్చాడు దర్శకుడు హరీష్ శంకర్. నిజంగా కొత్త కథతో తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమాను తనదైన మాస్ మసాలాలతో హీరోయిన్ తో అంగాంగ ప్రదర్శనతో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు. మరోవైపు పాటల్లో హీరోయిన్ తో హీరో వెక్కిలి చేష్టలను కాస్త తగ్గించి చూపించి ఉంటే బాగుండేది. దేశ సరిహద్దులను కాపాడే సైనికుడు కాదు.. దేశ సంపదను కాపాడే వాడు కూడా సైనికుడే అనే కొన్ని డైలాగులు మెప్పిస్తాయి. ఇక హీరోయిజం ఎలివేట్ కావాలంటే విలనిజం పండాలి. కానీ ఇందులో సినిమా ప్రారంభంలో ఉన్న జగపతి బాబు విలనిజం.. రవితేజ ఎంట్రీ తర్వాత తేలిపోయింది. దాన్ని ఇంకాస్త ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా చూపిస్తే బాగుండేది. టామ్ అండ్ జెర్రీలా సాగాల్సిన స్టోరీని ఇంకాస్త ఎఫెక్టివ్ గా చూపించి ఉంటే బాగుండేది.
హరీష్ శంకర్ ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ కోసం ఏదో కొన్ని సీన్స్ రాసుకొని సినిమా నిడివి పెంచాడు. ఇంటర్వెల్ వరకు అసలు సినిమా కథ ట్రాక్ పై ఎక్కదు. ఇంటర్వెల్ కు ముందు అసలు కథలోకి తీసుకెళ్లాడు. ఈ సందర్భంగా రవితేజ, జగపతి బాబులపై వచ్చే కొన్ని సీన్స్ మాస్ ప్రేక్షకులతో ఈలల తెప్పించేలా ఉన్నాయి. మరోవైపు ఈ సినిమాలో హీరోకు తన ఊర్లో ఓ ఆర్కెస్ట్రా ఉంటుంది. పైగా అందులో అన్ని హిందీ పాటలే పాడుతుంటాడు. అందులో అమితాబ్ పాటలు కాకుండా ‘ఫూల్ ఔర్ కాంటే’, ‘ఆషికి’ వంటి పాటలతో ప్రేక్షకులను ఎక్కడికో తీసుకెళ్లాడు దర్శకుడు హరీష్ శంకర్. ఆ పాటలన్ని లోకల్ హిందీ తెలిసిన హైదరాబాదీ ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అవుతారు. కానీ పల్లెలు, హిందీ పాటల గురించి అవగాహన లేని మాస్ జనాలకు ఈ పాటలు అంతగా ఎక్కవు. మరోవైపు కిషోర్ కుమార్, కుమార్ సాను వంటి హిందీ గాయకుల గురించి ఈ సినిమాలో చర్చకు తీసుకొచ్చాడు. కథలో అసలు పాయింట్ కంటే ఇవే ఎక్కువ అయ్యాయి. మొత్తంగా హరీష్ శంకర్ ‘రెయిడ్’ కథను పూర్తిగా తనదైన కమర్షియల్ యాంగిల్ లో మార్చుకొని తనదైన మాస్ మసాలతో ఈ సినిమా తెరకెక్కించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఆర్ట్ వర్క్ అద్భుతం. ఈ సినిమా ఆనాటి వింటేజ్ కాలాన్ని హరీష్ శంకర్ అద్భుతంగా రాబట్టుకొన్నాడు. పాటలన్ని ప్రేక్షకులు సీట్లపై లేచి గోల చేసేలా ఊర మాస్ గా ఉన్నాయి. హీరోయిన్ అందాలు ఈ సినిమాకు స్పెషల్ ఎస్సెట్. ఈమెలో కొంత కీర్తి సురేశ్ పోలికలు కనిపిస్తున్నాయి. ఎడిటర్ ఈ సినిమాకు ఎక్కడ కత్తెర వేయాలో తెలియలేదనే చెప్పలి. మరోవైపు ఇంకమ్ టాక్స్ ఆఫీసర్స్ లలో డబ్బులకు లొంగిపోయేవాళ్లున్నారని ఈ సినిమాలో చూపించడం హరీష్ శంకర్ గట్స్ ను తెలియజేస్తుంది.
నటీనటుల విషయానికొస్తే..
రవితేజకు ఇలాంటి ఊర మాస్ క్యారెక్టర్స్ కొత్త కాదు. డాన్ శీను తర్వాత మరోసారి అమితాబ్ బచ్చన్ పేరుతోనే ‘మిస్టర్ బచ్చన్’గా తనదైన శైలిలో నటించి మెప్పించాడు. అటు నిజాయితీ గల ఇంకమ్ టాక్స్ ఆఫీసర్ పాత్రలో మంచి నటనే కనబరిచాడు. జగపతి బాబు నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మరోసారి విలనిజంతో చెలరేగిపోయాడు. సిద్దు జొన్నలగడ్డ కాసేపు ఉన్నంతలో టిల్లు మార్క్ నటనతో ఆకట్టుకున్నాడు. హీరో తండ్రి పాత్రలో నటించిన తనికెళ్ల భరణి అందులో జీవించాడు. హీరోయిన్ భాగ్యశ్రీ తొలి సినిమాలోనే తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకోవడంతో పాటు ఎమోషన్ సీన్స్ పండించింది. గ్లామర్ ప్రదర్శనలో ఎలాంటి మొహమాట పడలేదు. నటిగా మంచి భవిష్యత్తు ఉంది. చాలా యేళ్ల బాబు మోహన్ ఈ సినిమాలో మంచి పాత్రలో కనిపించారు.
ప్లస్ పాయింట్స్
రవితేజ నటన
పాటలు
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్
ఫస్ట్ హాఫ్
ఎడిటింగ్
లాజిక్ లేని సీన్స్
పంచ్ లైన్.. హరీష్ శంకర్ మార్క్ ‘మిస్టర్ బచ్చన్’..
రేటింగ్: 3/5
ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..
ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter