Pawan Kalyan vs Allu Arjun: ఏపీ ఎన్నికలు మెగా కుటుంబంలో చిచ్చు రేపిన విషయం తెలిసిందే. ఆ వివాదం చల్లారింది అని భావిస్తున్న సమయంలో ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లు చల్లారిన వివాదానికి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆజ్యం పోశాయి. ఆ వివాదం మరింత ముదిరినట్టు కనిపిస్తోంది. రాజకీయంగా తనకు విరుద్ధంగా వెళ్లిన తన అల్లుడు, సినీ హీరో అల్లు అర్జున్‌ను ఉద్దేశించి పవన్ పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. బన్నీ నటించిన సినిమాను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఏపీ రాజకీయాలతోపాటు సినిమా పరిశ్రమలోనూ తీవ్ర చర్చనీయాంశమైంది.
Also Read: Venu Swamy Astrology: జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలనం.. నాగచైతన్య, శోభిత నిశ్చితార్థంపై ఏమన్నాడు
బెంగళూరు పర్యటన
వన్య ప్రాణి, అటవీ సంరక్షణ అంశాలపై చర్చించేందుకు పొరుగు రాష్ట్రం కర్ణాటక ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ చర్చలు జరిపారు. బెంగళూరులో బుధవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, అటవీశాఖ మంత్రి ఈశ్వర్ కాండ్రేతో పవన్ సమావేశమయ్యారు. చిత్తూరు జిల్లాలో ఏనుగులు సృష్టిస్తున్న విధ్వంసంపై చర్చించారు. ఈ క్రమంలో ఎర్రచందనం అక్రమ రవాణాపై కూడా అక్కడి ప్రభుత్వంతో పవన్ మాట్లాడారు. ఎర్ర చందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు సహకరించాలని.. చెక్‌పోస్ట్‌ల సహకారం కోరారు. మరికొన్ని కీలక అంశాలపై చర్చించిన అనంతరం ఉమ్మడి విలేకరుల సమావేశం నిర్వహించారు. చర్చల అంశాలను వివరిస్తూనే పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
వివాదానికి ఆజ్యం
అటవీ సంపద పరిరక్షణపై పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. '40 ఏళ్ల కిందట సినిమాలో హీరో అడవులను కాపాడేవాడు. కానీ ఇప్పుడు హీరో అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడు. ఇది ప్రస్తుతం మన సినిమా పరిస్థితి' అంటూ వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు అక్కడ సాధారణమే అనిపించగా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సంచలనంగా మారాయి. పవన్ వ్యాఖ్యలపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చ నడిచింది. పవన్ కల్యాణ్ పరోక్షంగా తన అల్లుడు అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమాల గురించే మాట్లాడారని చర్చించుకుంటున్నారు.
ముదురుతున్న వివాదం
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సొంతం చేసుకుంది. ఆ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలోనే ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమానే ప్రస్తావించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అయితే పవన్ ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యాఖ్యలు చేసినట్లు చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అల్లు అర్జున్ తనకు, జనసేన పార్టీకి మద్దతు తెలపకుండా తన మిత్రుడు, వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి మద్దతు తెలపడమే కాకుండా ప్రచారం చేయడం కలకలం రేపిన విషయం తెలిసిందే.
విడిపోయిన అభిమానులు
అప్పటి నుంచి కొణిదెల కుటుంబం, అల్లు అర్జున్ కుటుంబం మధ్య తీవ్ర భేదాభిప్రాయాలు వచ్చాయి. అప్పటి నుంచి ఆ కుటుంబాల మధ్య తీవ్ర రచ్చ జరుగుతోంది. అభిమానుల్లో కూడా కొణిదల, అల్లు అని రెండు వర్గాలు ఏర్పడ్డాయి. పవన్ తాజా వ్యాఖ్యలతో ఆ కుటుంబాల మధ్య దూరం మరింత పెరిగినట్టు కనిపిస్తోంది. అయితే ఈ వివాదం కారణంగానే ఆగస్టులో విడుదల కావాల్సిన 'పుష్ప 2' సినిమా వాయిదా పడిందని చర్చ జరుగుతోంది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అసలు ఆ సినిమా విడుదల కాదని తెలుస్తోంది. మరి ఈ పరిణామాలు రాజకీయంగా.. సినిమాపరంగా ఏం జరుగుతుందో వేచి చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter